ఏసీబీకి చిక్కిన పీఆర్‌ ఏఈ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పీఆర్‌ ఏఈ

Jul 31 2025 7:26 AM | Updated on Jul 31 2025 9:10 AM

ఏసీబీ

ఏసీబీకి చిక్కిన పీఆర్‌ ఏఈ

జగిత్యాలక్రైం: ప్రభుత్వ పనులు చేపట్టిన సివిల్‌ కాంట్రాక్టర్‌కు క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేసిన జగిత్యాల పంచాయతీ రాజ్‌ శాఖలో విజిలెన్స్‌ క్వాలిటీకంట్రోల్‌ విభాగం ఏఈ అనిల్‌ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లికి చెందిన పంచరి వెంకటేశ్‌ సవిల్‌ కాంట్రాక్టర్‌. ఐదేళ్ల క్రితం కోరుట్లలో రూ.13.80 లక్షలతో ఎల్లమ్మ (గౌడ) కమ్యునిటీ హాల్‌ నిర్మించాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయింది. అలాగే రెండేళ్ల క్రితం రూ.4.50 లక్షలతో చిన్నమెట్‌పల్లిలో హనుమాన్‌ కమ్యునిటీ హాల్‌ నిర్మించాడు. కోరుట్లలోని ఆర్డీవో కార్యాలయం ప్రహరీని రూ.5లక్షలతో పూర్తి చేసి ఎంబీ రికార్డు పూర్తి చేయించాడు. మొత్తం మూడు పనులను రూ.23.30లక్షలతో పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఏఈ అనిల్‌కుమార్‌ను కొన్నాళ్లుగా కోరుతున్నాడు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన అనిల్‌.. గత శనివారం రూ.18 వేలు డిమాండ్‌ చేశాడు. దీనికి వెంకటేశ్‌ రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని అదేరోజు రూ.3వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం కరీంనగర్‌రోడ్‌లో ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ విజిలెన్స్‌ క్వాలిటీ కంట్రోల్‌ కార్యాలయం వద్ద కాపుకాశారు. వెంకటేశ్‌ నుంచి అనిల్‌ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. అనిల్‌ను కరీంనగర్‌ ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్‌ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబరు 1064లో సంప్రదించాలని డీఎస్పీ వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు పున్నం చందర్‌, కృష్ణకుమార్‌, తిరుపతి, సిబ్బంది శ్రీకాంత్‌, విష్ణు, బాలు, మొగిలయ్య పాల్గొన్నారు.

రూ.7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

క్వాలిటీ కంట్రోల్‌ సర్టిఫికెట్‌తో డబ్బుల డిమాండ్‌

ఏసీడీ డీఎస్పీ విజయ్‌కుమార్‌ వెల్లడి

ఏసీబీకి చిక్కిన పీఆర్‌ ఏఈ1
1/1

ఏసీబీకి చిక్కిన పీఆర్‌ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement