
కలెక్టర్ ఆర్థిక చేయూత
సిరిసిల్లకల్చరల్/కోనరావుపేట: ఆపన్నులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆర్థిక చేయూత అందించారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన దుంపెట దక్షిత మధ్యప్రదేశ్‌లోని కత్నిలో సైనిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇందుకోసం రూ.2.5లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంది. పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఆదుకోవాలని దక్షిత తండ్రి నాగరాజు అభ్యర్థన మేరకు కలెక్టర్ రూ.లక్ష చెక్కును బుధవారం కలెక్టరేట్‌లో అందజేశారు. అలాగే ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన తస్లీమా అనారోగ్యంతో, చిన్నలింగాపూర్‌కు చెందిన అనంతలక్ష్మి కంటి సమస్యతో బాధపడుతుండగా, తస్లీమాకు రూ.20వేలు, అనంతలక్ష్మికి రూ.10 వేలు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
లింగ నిర్ధారణ చేస్తే చర్యలు
సిరిసిల్లకల్చరల్: గర్భస్థ పిండ ఆరోగ్య స్థితి తెలుసుకునే స్కానింగ్ పరీక్షలను జిల్లాలో కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత హెచ్చరించారు. బుధవారం నిర్వహించిన జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆడపిల్ల అని తెలిసి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నిరూపణ అయిన స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. రేడియాలజిస్టు, డాక్టర్ పట్టా రద్దు కోసం సిఫారస్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ అంజలి ఆల్‌ఫ్రెడ్, డాక్టర్ సంతోష్, చింతోజు భాస్కర్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేటలో విషజ్వరాలు
కోనరావుపేట(వేములవాడ): మండలకేంద్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. కొద్దిరోజు లుగా వడ్డెరకాలనీలో సుమారు 20 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరికి డెంగీ నిర్ధారణ అయినట్లు తెలిసింది. కాగా, వడ్డెరకాలనీలో పారిశుధ్య పనులు సక్రమంగా లేకపోవడం సమస్యగా మారింది. రహదారులపై, ఇళ్ల సమీపంలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగి కాలనీవాసులు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టకపోవడంతో స్థానికులు జ్వరాలబారిన పడుతున్నట్లు భావిస్తున్నారు.

కలెక్టర్ ఆర్థిక చేయూత