కూటమి పగ | - | Sakshi
Sakshi News home page

కూటమి పగ

Mar 11 2026 8:35 AM | Updated on Mar 11 2026 8:35 AM

శనగలపై దిగుమతి సుంకం పెంచాలి..

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలపై సుంకం తగ్గించిన కేంద్రం శనగ రైతును పట్టించుకోని చంద్రబాబు కూటమి ప్రభుత్వం ధరలు లేక జిల్లాలోని కోల్డ్‌ స్టోరేజీల్లో మగ్గుతున్న 10 లక్షల క్వింటాళ్ల శనగలు క్వింటా రూ.5 వేలు కూడా పలకక రైతుల గగ్గోలు శనగ రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్‌ సీపీ పోరుబాట

కేంద్రానికి లేఖలు రాసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు...

మద్దతు ధర లేక అల్లాడుతున్నారు

శనగ రైతుపై

విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు సుంకం పెంచాలి. సుంకంతో పాటు సెస్‌ తగ్గించడం వల్ల దిగుమతులు 2023–24లో 1.64 లక్షల టన్నుల నుంచి 2024–25లో 15.06 లక్షల టన్నులకు తీవ్రంగా పెరిగాయి. దిగుమతి సుంకం తగ్గించడంతో తక్కువ ధరకు విదేశీ శనగలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. తద్వారా దేశీయంగా మన రైతులు పండించిన శనగ ధరలు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువకు పడిపోయాయి.

– మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు ఇన్‌చార్జ్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో శనగ రైతు కుదేలవుతున్నాడు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలపై సుంకాలను తగ్గించి కేంద్ర ప్రభుత్వం దేశీయ రైతుల నడ్డి విరిచింది. సరైన ధరలు లేక ఇప్పటికే లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌ స్టోరేజీల్లో మగ్గిపోతుండగా, ఈ ఏడాది రబీ సీజన్‌లో శనగ పంట మరికొద్ది రోజుల్లో చేతికి రానుంది. దాంతో వైఎస్సార్‌ సీపీ శనగ రైతులను ఆదుకోవాలంటూ పోరుబాట పట్టింది.

ఒంగోలు సబర్బన్‌:

చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు దాటినా రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. అన్నిరకాల రైతులు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వేడుకున్నా ప్రయోజనం శూన్యం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఏటా 1.50 లక్షల ఎకరాలకు పైగా శనగ సాగు చేస్తారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అయితే దాదాపు 2 లక్షల ఎకరాల వరకూ శనగ సాగు చేశారు. అలాంటిది చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత శనగ సాగు ఏడాదికేడాదికి తగ్గిపోతోంది. గత సంవత్సరం లక్ష ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరం కేవలం 70 వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పటి వరకు సాగు చేశారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో శనగ పంట మరో నెల రోజుల్లో కోతకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముందుగా వేసిన పంటను వారం, పది రోజుల్లో కోత కోసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దాంతో వైఎస్సార్‌ సీపీ శనగ రైతులను ఆదుకోవాలంటూ పోరుబాట పట్టింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవి బాబులు ఈనెల 7వ తేదీన కలెక్టర్‌ పి.రాజాబాబును కలిసి శనగ రైతులను ఆదుకోవాలంటూ కోరారు.

10 లక్షల క్వింటాళ్లు కోల్డ్‌ స్టోరేజీల్లో...

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటంతో రెండేళ్ల నుంచి శనగ నిల్వలు 10 లక్షల క్వింటాళ్లు కోల్డ్‌ స్టోరేజీల్లో మూలుగుతున్నాయి. 50 వేల మందికి పైగా రైతులు తమ శనగ నిల్వలను కోల్డ్‌ స్టోరేజీల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. కనీసం మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయకపోవటంతో నష్టాలకు అమ్ముకోలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక శనగ రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఒంగోలుతో పాటు సంతనూతలపాడు, కొండపి, అద్దంకి, దర్శి, మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోల్డ్‌ స్టోరేజీలలో పాత శనగలు మగ్గుతున్నాయి.

మద్దతు ధర కూడా లేక అవస్థలు...

శనగ పంటకు మద్దతు ధర లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5650 కూడా లేకపోవటంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ప్రస్తుతం క్వింటా రూ.5 వేల లోపే కొనుగోలు చేయటంతో కనీసం ఖర్చులు కూడా రావని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చివరకు కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న శనగలకు అద్దెలు కూడా కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూలీలకు, పెట్టిన పెట్టుబడులు చెల్లించేందుకు కొందరు రైతులు ఇచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

విదేశాల నుంచి వచ్చే శనగకు దిగుమతి సుంకం తగ్గించి మోసం...

విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలకు కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం దిగుమతి సుంకం 60 శాతం ఉండగా దాన్ని పది శాతానికి తగ్గించింది. దాంతో విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా శనగలు దేశంలోని మార్కెట్లకు చేరనున్నాయి. ఫలితంగా దేశీయంగా పండించిన శనగలకు ధర ఇంకా దారుణంగా పడిపోయే పరిస్థితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా కల్పిస్తున్నాయి. ఇక్కడి శనగలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు దిగుమతి సుంకాన్ని తగ్గించకుండా చూడటంలో ఎలాంటి శ్రద్ధ చూపలేదు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో దిగుమతి సుంకం పెంచేందుకు పోరాటం...

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే శనగలపై సుంకాన్ని పెంచేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రుల చుట్టూ తిరిగి, లేఖల మీద లేఖలు రాసి దిగుమతి సుంకం 30 శాతం ఉన్నదానికి 60 శాతానికి తీసుకెళ్లారు. దాంతో మన రాష్ట్రంలోని శనగ రైతులతో పాటు దేశంలో శనగ పండించిన రైతులందరికీ ప్రయోజనం చేకూరింది.

శనగ రైతుకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి ఆదుకున్న వైఎస్‌ జగన్‌...

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత శనగ రైతుల కష్టాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుర్తించారు. 2014 నుంచి 2019 మే నెల వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు శనగ రైతులను పట్టించుకోకపోవటంతో రైతులు పండించిన శనగలను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వచేసుకొన్నారు. దాంతో నష్టాలతో ఉన్న శనగ రైతులకు ఆదుకోవాలన్న సంకల్పంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న శనగలకు క్వింటాకు రూ.1,500 ఇచ్చి ఆదుకున్నారు. ఆ విధంగా జిల్లాలోని దాదాపు 35 వేల మంది శనగ రైతులకు ప్రయోజనం చేకూరింది. దానికితోడు 2020 నుంచి బహిరంగ మార్కెట్లో జేజే రకం శనగలకు దాదాపు క్వింటా రూ.8 వేలకు పైగా ధర పలికింది. కాగ్‌–2 రకానికి రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు ధర రావటంతో రైతులు ఎంతో సంతోషంగా పంట సాగు చేశారు.

రాష్ట్రంలోని శనగ రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు తగ్గించిన సుంకాన్ని పెంచాలని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా 50 నుంచి 60 శాతం వరకు సుంకాన్ని పెంచాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, మద్దెల గురుమూర్తిలు కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు, పీయూష్‌ గోయల్‌కు లేఖలు రాశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచనల మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏవిధంగానైనా శనగ రైతులను ఆదుకోవాలన్నదే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ పోరాడుతోంది.

జిల్లాలో ప్రధాన పంట శనగ..రెండేళ్ల నుంచి పండించిన శనగలకు మద్దతు ధరలు లేక కోల్డ్‌ స్టోరేజీల్లో మగ్గుతున్నాయి. ఈ సంవత్సరం కూడా శనగ పంట చేతికి వచ్చే స్థితిలో విదేశాల నుంచి సుంకాలు లేకుండా దిగుమతి అవుతున్న శనగల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో శనగ రైతులు నష్టపోతుంటే వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్వింటాకు రూ.1500 చొప్పున ఒక్కో రైతుకు 35 క్వింటాళ్లకు ఇచ్చి ఆదుకున్నారు. ప్రస్తుతం క్వింటాలుకు రూ.1000 బోనస్‌ ప్రకటించాలి.

– చుండూరు రవిబాబు, వైఎస్సార్‌సీపీ ఒంగోలు ఇన్‌చార్జ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement