రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు ఇరువురు సిబ్బంది వద్ద రూ.5 వేలు స్వాధీనం బీపీఎస్ స్కీంలో అక్రమాలపై ఆకస్మిక తనిఖీలు నేడు బీపీఎస్ స్కీంకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా ఒంగోలు కార్యాలయ ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఈ రికార్డులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవటానికి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)ను ప్రవేశపెట్టింది. ఆ స్కీంలో ఏమైనా అక్రమాలు చోటుచేసుకున్నాయా అన్న అంశంపై రికార్డులు పరిశీలించేందుకు ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఒంగోలు ఏసీబీ సీఐలు బి.రమేష్ బాబు, సీహెచ్.శేషుల ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. అధికారులు మధ్యాహ్నం 12.30 గంటలకు కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సెక్షన్‌లోకి ప్రత్యేక ఏసీబీ బృందం ప్రవేశించింది. అప్పటి వరకు లోపల ఉన్న అధికారులను, సిబ్బందిని ఎవరినీ బయటకు పోనీయకుండా వాళ్ల వద్ద ఉన్న సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) పోస్టు ఖాళీగా ఉంది. ఏసీపీగా ఉన్న జెడ్.సుధాకర్ ఫిబ్రవరిలో పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఏసీపీ అదనపు బాధ్యతలు టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీఓ) బాబూరావు నిర్వర్తిస్తున్నారు.
అయితే ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలోకి ప్రవేశించిన సమయంలో బాబూరావు తన చాంబర్‌లోనే ఉన్నారు. అధికారులు చేసిన సోదాల్లో ఇరువురు సిబ్బంది వద్ద ఒకరి వద్ద రూ.3 వేలు, మరొకరి వద్ద రూ.2 వేలు నగదు ఉంది. అవి సొంత ఖర్చుల కోసం దగ్గర పెట్టుకున్నట్లు ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి అడుగుపెట్టే సమయానికి నగర కమిషనర్ కే.వెంకటేశ్వరరావు ఎస్‌ఎస్ ట్యాంకులను పరిశీలించేందుకు వెళ్లినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ విభాగంలోనే ప్రత్యేక చాంబర్ ఉండే మున్సిపల్ సర్వేయర్ ఆవుల శ్రీనివాసరావు కూడా కార్యాలయంలో లేరు.
బీపీఎస్ రికార్డుల పరిశీలన లోతుగా...
ఏసీబీ అధికారులు బీపీఎస్ స్కీమ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రెగ్యులరైజ్ చేశారు.. ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి.. నగరంలో మొత్తం ఎన్ని అక్రమ భవనాలు ఉన్నాయి.. వాటిలో బీపీఎస్ కోసం చేసుకున్న దరఖాస్తులు ఎన్ని.. కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో ఏమైనా అక్రమాలు జరిగాయా అన్న అన్ని కోణాల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. బుధవారం ఆయా రికార్డుల ఆధారంగా క్షేత్ర స్థాయి పరిశీలించనున్నారు. దాడుల్లో ఏసీబీ ఎస్సైలు షరీఫ్, ప్రసాదుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


