16వ తేదీతో ముగియనున్న పాలకమండళ్లు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జీఓ ఉమ్మడి జిల్లాలో ఒంగోలుకు కలెక్టర్ రాజాబాబు మిగిలిన మున్సిపాలిటీలకు ఆర్డీఓలు
మార్కాపురం: ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల్లో ఈనెల 16తో ముగియనున్న పాలక మండళ్ల పదవీ కాలం నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మంగళవారం జీఓ ఆర్‌టీ నం 284ను విడుదల చేశారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని, కొత్తగా ఎన్నికయ్యే పాలకమండళ్లు బాధ్యతలు స్వీకరించే వరకూ లేదా గరిష్టంగా ఆరు నెలల పాటు మున్సిపాలిటీల్లో పరిపాలన నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, మార్కాపురం జిల్లాలో జిల్లా కేంద్రమైన మార్కాపురం, గిద్దలూరు, చీమకుర్తి, అద్దంకి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటికి ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు, అద్దంకి మున్సిపాలిటీకి అద్దంకి ఆర్డీఓ జాన్సన్, చీమకుర్తి మున్సిపాలిటీకి ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్నను, మార్కాపురం మున్సిపాలిటీకి మార్కాపురం ఆర్డీఓ పీ ప్రభాకర్‌ను, గిద్దలూరు మున్సిపాలిటీకి వెలుగొండ ప్రాజెక్టు భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరును, కనిగిరి మున్సిపాలిటీకి కనిగిరి ఆర్డీఓ శివరామిరెడ్డిని నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2021 మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2021 మార్చి 14న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఎన్నికై న సభ్యులు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈనెల 16తో మున్సిపల్ పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో పట్టణాల్లో, నగరాల్లో పాలన సజావుగా సాగేందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. అప్పటి నుంచి ఆయా మున్సిపాలిటీల్లో కమిషనర్లు స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఐదేళ్లుగా మున్సిపల్ కౌన్సిల్‌లు ఉండటంతో ఆయా పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోదం పొందిన తరువాత పనులు చేపట్టేవారు. పట్టణాల్లో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సమస్య, వీధిలైట్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులన్నీ మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిల్ పర్యవేక్షించేవారు. ఇకపై ఈ బాధ్యతలన్నీ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జరగనున్నాయి.


