సమ్మర్ స్టోరేజీలను పరిశీలించిన సీపీఎం నాయకులు
ఒంగోలు టౌన్: వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో నగరంలోని ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా నగర పాలక సంస్థ ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, ట్యాంకుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నా పాలకులు మొద్దునిద్ర వీడడంలేదని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు విమర్శించారు. నగరంలోని నీటి ఎద్దడి ఇబ్బంది పెడుతుండడంతో సీపీఎం నాయకుల బృందం మంగళవారం సమ్మర్ స్టోరేజీ ట్యాంకునుల పరిశీలించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వాస్తవానికి ట్యాంకుల్లో 5800 మిలియన్ లీటర్ల నీరు నిల్వలు ఉండాలని, ప్రస్తుతం 3700 మిలియన్ లీటర్లు మాత్రమే ఉందని వివరించారు. వేసవి తీవ్రత వలన నీటి నిలువలు వేగంగా తగ్గిపోతున్నాయని, అయినా నగర పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే సాగర్ నుంచి నీరు తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. నగర శివారు ప్రాంతాల ప్రజలు నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారని, నగరంలోని 25 శాతం జనాభాకు ట్యాంకర్ల ద్వారా వారానికి ఒక్కసారి మాత్రమే నీరు సరఫరా చేస్తున్నారని చెప్పారు. మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ 2 ను పరిశీలించినప్పుడు భవనంపైన హై టెన్షన్ విద్యుత్ లైన్లు కేవలం 10 అడుగుల ఎత్తులోనే ఉన్నాయని, దీనివలన సిబ్బందికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలకు నీటిని సరఫరా చేసే మోటార్లు ఉన్న ప్రాంతానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కార్మికులు చెత్త, గడ్డి మధ్య వెళ్లాల్సి వస్తోందన్నారు. చెరువులోని నీరు పచ్చగా మారిందని, నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిశీలించిన బృందంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, ఎస్‌డీ హుసేన్ తదితరులు ఉన్నారు.


