ప్రయాణికుల భద్రత కోసమే డిజిటల్‌ స్టిక్కర్లు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల భద్రత కోసమే డిజిటల్‌ స్టిక్కర్లు

Mar 11 2026 7:23 AM | Updated on Mar 11 2026 7:23 AM

ప్రయాణికుల భద్రత కోసమే డిజిటల్‌ స్టిక్కర్లు

ఎస్పీ హర్షవర్థన్‌ రాజు

ఒంగోలు టౌన్‌: ప్రజలకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా పోలీసులు వినూత్న చర్యలను చేపట్టింది. జిల్లా నలుమూలల నుంచి నగరానికి వచ్చి పోయే ప్రజలు, నగర ప్రజలకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది. నగరంలోని ఆటోలకు డిజిటల్‌ స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. మంగళవారం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో డిజిటల్‌ స్టిక్కర్లను అమర్చే ప్రక్రియను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఆటోలన్నింటికీ ఏ4 సైజు డిస్‌ప్లే బోర్డు, క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన రెండు స్టిక్కర్లను అందజేసినట్లు తెలిపారు. డిజిటలైజేషన్‌ నంబర్‌ స్టిక్కర్ల ద్వారా ప్రతి ఆటోకు ఒక గుర్తింపు ఉంటుందని, ప్రయాణికుల ఆటోను సులభంగా గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఆటోల డిజిటలైజేషన్‌ ద్వారా చట్టవిరుద్ధకార్య కలాపాలను నియంత్రించడం సులువవుతుందని చెప్పారు. క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన తరువాత ఆప్షన్స్‌ వస్తాయని తెలిపారు. ఆటో డ్రైవర్‌, ఓనర్‌ గురించి పూర్తి వివరాలు ప్రింట్‌ తీసుకోవచ్చని చెప్పారు. షేర్‌ ఆన్‌ వాట్సప్‌ యాప్‌ ద్వారా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు క్యూ ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా తాను ఏ ఆటోలో ప్రయాణిస్తున్నామో కుటుంబ సభ్యులకు తెలియజేసే అవకాశం ఉందన్నారు. లోకేషన్‌ ట్రాక్‌ చేసే సౌకర్యం ఉందన్నారు. ఆటో డ్రైవర్‌ ప్రవర్తన తీరును రేటింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పెడితే పోలీసు కంట్రోలు రూంకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అత్యవసరమైతే 112 కాల్‌ చేయవచ్చన్నారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆటో డ్రైవర్లకు గంజాయి వినియోగం, విక్రయాలు, కష్టనష్టాల గురించి అవగాహన కల్పించారు.

ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అభినందనలు...

ఆటోలో దొరికిన బ్యాగులను తిరిగి ఇచ్చిన ఆటో డ్రైవర్లను ఎస్పీ హర్షవర్థన్‌ రాజు ప్రత్యేకంగా అభినందించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల కోర్టు సెంటర్‌ వద్ద ఆటో ఎక్కిన ప్రయాణికులు దిగే సమయంలో బ్యాగు మరిచిపోయారు. ఆటో డ్రైవర్‌ గద్దె నాగేశ్వరరావు ఆ బ్యాగును వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆ బ్యాగులో రూ.30 లక్షల విలువైన బంగారు నగలు, నగదు ఉన్నాయి. అలాగే బిలాల్‌ నగర్‌కు చెందిన షేక్‌ ఖలీల్‌ అనే ఆటో డ్రైవర్‌ వెంకటేశ్వరనగర్‌ కాలనీ వద్ద ప్రయాణికులను ఎక్కించుకొని జీజీహెచ్‌ వద్ద దించారు. ఆటోలో బ్యాగు మరిచి దిగారు. దాన్ని గమనించిన ఖలీల్‌ బ్యాగును వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్లో అప్పగించారు. ఆ బ్యాగులో 6 సవర్ల బంగారం, వెండి ఉన్నాయి. అత్యంత ఖరీదైన నగలు, నగదు దొరికిననా ఎంతో నిజాయితీగా పోలీసులకు అప్పగించి ఔన్యత్యం చాటుకున్నారని అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్‌ డిఎస్పీ శ్రీనివాసరావు, ట్రాఫిక్‌ సీఐ జగదీష్‌, టూ టౌన్‌ సీఐ మేడా శ్రీనివాసరావు, ఆర్‌ఐ రమణా రెడ్డి, ట్రాఫిక్‌ ఎస్సై కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement