గిద్దలూరు రూరల్: గంజాయి విక్రయం కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న వివరాలు వెల్లడించారు. గిద్దలూరు మండలం కేఎస్‌పల్లె గ్రామానికి చెందిన అలమూరి చంద్రయ్య, డిగపాటి వెంకటేష్, వెంగళ్‌రెడ్డిపల్లె గ్రామానికి చెందిన బిజ్జం శ్రీరాంరెడ్డి ముగ్గురు ఉప్పలపాడు గ్రామ సమీపంలో 3 కిలోల గంజాయి కలిగి ఉండటంతో అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.30 వేలు ఉంటుందని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలైన చంద్రయ్య విజయనగరం నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అతడి స్నేహితులైన వెంకటేష్, శ్రీరాం రెడ్డిల సహాయంతో విక్రయిస్తున్నారు. యువతను గంజాయికి బానిసలు చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచి చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు కె.సురేష్, రామకోటయ్య, ఏఎస్సై జిలానీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దర్శి: అద్దంకి రోడ్డులోని వీరాయపాలెం మేజర్ వద్ద కాలువ పక్కగా నడిచి వస్తుండగా ఫిట్స్ వచ్చి కాలువలో పడి పద్మ(40) అనే మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..బందువులంతా ఫంక్షన్‌లో ఉండగా ఆమె కాలువ పక్క నుంచి నడుచుకుంటూ వస్తుంది. అకస్మాతుగా ఫిట్స్ వచ్చి కాలువలో పడిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ చూడక పోవడంతో ఆమె మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.


