కొమరోలు: లారీ వేగంగా గొర్రెల మందను ఢీకొనడంతో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే..స్థానిక నయారా పెట్రోలు బంకు సమీపంలో గొర్రెల మంద వెళుతుండగా పోరుమామిళ్ల నుంచి బేస్తవారపేట వైపుగా వెళుతున్న ఓ లారీ మంగళవారం తెల్లవారుజామున వేగంగా వెళుతూ గొర్రెల మందును ఢీకొంది. ప్రమాదంలో 30 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. గొర్రెల మందను కమ్మనేటి క్రిష్ణయ్య, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రాయపాటి ప్రవీన్‌లు గిద్దలూరు మండలం పొదలకొండపల్లె నుంచి వైఎస్‌ఆర్ కడప జిల్లా నాగులకుంట్ల గ్రామానికి తోలుకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెలు మృతి చెందడంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లిందని గొర్రెల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
గిద్దలూరు రూరల్: పట్టణంలోని నల్లబండ బజారులోని పాములపల్లె రైల్వే గేటు వద్ద సోమవారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లె గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి పట్టణంలోని కొన్ని రేషన్‌షాపు డీలర్ల వద్ద 20కి పైగా బియ్యం బస్తాలను కొనుగోలు చేసి ట్రాక్టర్‌లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని ట్రాక్టర్‌తో సహా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన రేషన్ బియ్యం బస్తాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించి 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉలవపాడు: మండల పరిధిలోని చాకిచర్ల పంచాయతీ చినపట్టపుపాలెం తీరానికి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడు గళ్ల చొక్కా, నల్ల షార్ట్ ధరించి ఉన్నాడు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లి వస్తున్న సమయంలో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వయస్సు సుమారు 40 నుంచి 50 ఏళ్ల లోపు ఉంటుందని ఎస్సై సుబ్బారావు తెలిపారు. వీఆర్‌ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


