కృష్ణలంక(విజయవాడతూర్పు):
రెండు వారాల కిందట కాలేజీ నుంచి కనిపించకుండా పోయిన విద్యార్థి కృష్ణానదిలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన గొలమారి శివారెడ్డి, లక్ష్మీ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సాయికృష్ణారెడ్డి ఇంజినీరింగ్ పూర్తి చేసి చైన్నెలో ఉంటుండగా చిన్న కుమారుడు సాయి నిహార్‌రెడ్డి(16) నిడమానూరులోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గత నెల 19వ తేదీన నిహార్‌రెడ్డి తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాలేజీ నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం తాను పీఎన్‌బీఎస్ బస్టాండ్‌కు వెళ్లి వస్తాను, మీరు కాలేజీకి వెళ్లండి అని నిహార్‌రెడ్డి తన స్నేహితులకు చెప్పగా వారు కాలేజీకి వెళ్లారు. 20వ తేదీకి కూడా కాలేజీకి చేరుకోకపోవడంతో కాలేజీ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. వెంటనే కాలేజీ వద్దకు చేరుకుని సిబ్బందితో కలిసి పటమట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం కృష్ణానదిలో భవానీద్వీపంలో ఒక బాలుడు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిహార్‌రెడ్డి తల్లిదండ్రులకు చూపించారు. గుర్తులు ఆధారంగా తన కుమారుడు నిహార్‌రెడ్డిగా నిర్ధారించారు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుండడంతో వారం రోజుల కిత్రం చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.


