ఒంగోలు సబర్బన్: స్థానిక ప్రకాశం భవన్‌లోని గ్రీవెన్స్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో మొత్తం 277 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ పి.రాజా బాబు నిర్వహించిన కార్యక్రమంలో అర్జీదారులు పోటెత్తారు. ఈ సందర్భంగా మీకోసం అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు. పరిష్కరించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో వివరించాలన్నారు.
కమ్యూనిటీ హాలును కబ్జా చెర నుంచి విడిపించాలి:
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్‌లోని చెరువుకొమ్ముపాలెం ఎస్సీ కాలనీలో కబ్జాకు గురైన డాక్టర్ బాబూ జగజ్జీవన రామ్ కమ్యూనిటీ హాలును కబ్జా చెర నుంచి విడిపించాలని తాటిపర్తి రాగయ్యతో స్థానికులు కలెక్టర్ పి.రాజా బాబుకు ఫిర్యాదు చేశారు. చెరువుకొమ్ముపాలెలో 20 ఏళ్ల క్రితం ఊరిలోని సమస్యలను ప్రజలందరూ కూర్చొని మాట్లాడుకోవటానికి, సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనేది చర్చించుకోవటానికి, లైబ్రరీగా కూడా ఉపయోగించుకోవటానికి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ప్రస్తుతం కమ్యూనిటీ భవనాన్ని గ్రామానికి చెందిన అధికార టీడీపీకి చెందిన జడా సుధాకర్ స్వలాభం కోసం వాడుకుంటూ ఆ భవనాన్ని కబ్జా చేశాడు. ఆ భవనంలో వారికి సంబంధించిన వస్తువులన్నింటినీ వారి అవసరాల కోసం తమ స్వంత ఇంటిలా ఉపయోగించుకొంటున్నాడు. ఆ భవనానికి తాళం వేసి తమ వద్దనే ఉంచుకొంటున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు గతంలో వీఆర్‌ఓకు, సచివాలయ సిబ్బందికి, కలెక్టర్ గ్రీవెన్స్‌లో కూడా అర్జీ ఇచ్చామన్నారు. మున్సిపల్ కమిషనర్‌కు అనేక సార్టు అర్జీ ఇచ్చామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కమ్యూనిటీ హాలును ఖాళీ చేయమని చెప్పటానికి వచ్చిన అధికారులను తన రాజకీయ బలంతో బెదిరింపులకు గురి చేస్తున్నాడన్నారు. ప్రజా అవసరాల కోసం ఉపయోగపడాల్సిన సదరు కమ్యూనిటీ హాలును స్వాధీనం చేసి గ్రామ కమిటీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులను బెదిరిస్తున్న జడ సుధాకర్‌పై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ డి. హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మాధురి, కళావతి, డీపీఓ వెంకటేశ్వరరావులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కార్మిక నగర్ పేదలకు న్యాయం చేయాలి
ఒంగోలు టౌన్: నగరంలోని కార్మిక నగర్‌లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల గుడిసెలు కూల్చివేయడం దారుణమని, పేదలు నివసిస్తున్న భూమిని సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని సీపీఎం నాయకులు కలెక్టర్ పి.రాజాబాబుకు కోరారు. సోమవారం స్పందనలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 186లో నివసిస్తున్న పేదలకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో పెరిగిపోయిన అద్దెలను చెల్లించే స్థోమత లేని 70 కుటుంబాలు 15 ఏళ్ల క్రితం కార్మిక నగర్‌లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని తెలిపారు. అక్కడ నివసిస్తున్న వారికి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ కొందరు ప్రైవేటు వ్యక్తులు మూడు జేసీబీలు, 150 మంది వ్యక్తులతో కలిసి కార్మిక నగర్లోకి చొరబడి గుడిసెలను కూల్చివేశారని చెప్పారు. ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు కూడా అనుమతించకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని, భౌతిక దాడులు చేశారని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు విధ్వంసం సృష్టించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దాంతో రెచ్చిపోయిన ప్రైవేటు వ్యక్తులు ఈ నెల 4వ తేదీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆక్రమించుకున్నారని, బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం బాధిత కుటుంబాలు అక్కడే డేరాలు వేసుకొని నివసిస్తున్నారని, అధికారులు భూమి సర్వే చేసి బాధితులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సీపీఎం నాయకులు జి.రమేష్, తంబి శ్రీనివాసరావు, సయ్యద్‌హుసేన్, దామా శ్రీనివాసరావు కలెక్టర్‌ను కలిసిన వారిలో వున్నారు.


