డీఆర్వో ఓబులేసు
22ఏ భూ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టండి
పంచాయతీ కార్మికులకు రూ.21 వేలు ఇవ్వాలి
ఒంగోలు టౌన్: వైద్య ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న పారా మెడికల్ ఉద్యోగుల వేతన వ్యత్యాస బకాయిలను వెంటనే చెల్లించాలని యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన హాలులో డీఎంహెచ్‌ఓను కలిశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగులకు పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వేతనాలు చెల్లించడానికి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇందుకుగాను రూ.21.51 కోట్లు కూడా విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 2003 సెప్టంబర్ 14 నుంచి 2024 ఏప్రిల్‌లో రెగ్యులర్ అయిన హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మాసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా వర్తిస్తుందని వివరించారు. జిల్లాలో సుమారు 100కి పైగా వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారని, ఒక్కొక్కరికి సుమారు రూ.76 వేల వ్యత్యాస వేతన బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు పీహెచ్‌సీల నుంచి ఎరియర్ బిల్లులను ట్రెజరీలకు పంపించలేదని, దీనివలన ఆర్ధిక సంవత్సరం ముగిసి నిధులు వృథా అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, జిల్లా ట్రెజరీ అధికారులు జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.శ్రీధర్ బాబు, వై.సురేష్, కాలం సుబ్బారావు, సీహెచ్ పుల్లయ్య, మాచిరాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: పంచాయతీ కార్మికులు, ఎన్‌ఎంఆర్‌లు, గ్రీన్ అంబాసిడర్లకు మున్సిపల్ కార్మికుల మాదిరిగా నెలకు రూ.21 వేల జీతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం సంఘ గౌరవాధ్యక్షుడు ఎం.రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల గ్రామ పంచాయతీ కార్మికులు, 20 వేల గ్రీన్ అంబాసిడర్లు, 700 మంది ఎన్‌ఎంఆర్‌లు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు నిర్వహిస్తున్నారు. ఏడేళ్లుగా జీతాలు పెంచలేదని తెలిపారు. ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.12 వేల లోపు మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారని, కొన్ని చోట్ల మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర కొర జీతాలు కూడా నెల నెలా చెల్లించకపోవడంతో 4 నుంచి 24 నెలల వరకు బకాయిలు పేరుకుపోయాయని, గ్రీన్ అంబాసిడర్లకు కొన్ని చోట్ల మూడేళ్లుగా జీతాలు ఇవ్వకుండా పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడం, పెట్రోల్, గ్యాస్, కరెంట్ చార్జీల భారంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికులకు రూ.21 వేల జీతం అమలు చేయడం, బకాయిలు చెల్లించడం, హైకోర్టు తీర్పులు అమలు చేయడం, గుర్తింపు కార్డులు, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు చేయడం, చట్టబద్ధ సెలవులు కల్పించడం, ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచడం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎన్ రత్న కుమార్, మేకల మగ్గారావు, ఇండ్ల వినాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఉమ్మడి జిల్లా డీఆర్వో ఓబులేసు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువగా 22ఏ భూసమస్యలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ సమస్యలపై వచ్చే అర్జీలను పాత పద్ధతిన తహశీల్దార్ నుంచి ఆర్డీవోకు మళ్లీ ఆర్డీవో నుంచి కలెక్టర్‌కు పంపిస్తే తగు చర్యలు తీసుకుంటారన్నారు. దీనిపై ఇంకా స్పష్టమైన జీవో రానందున సమస్యలు పరిష్కారం కావడం లేదని వివరించారు. దాదాపు 476 ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారిని పిలిపించి వాటిని పరిశీలించి తగిన నివేదిక పంపాలని ఆదేశించారు. కారణం లేకుండా 22ఏలో చేర్చిన భూములపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా భూ వివాదాలను పరిష్కరించాలన్నారు. మిగిలిన సమస్యలపై కూడా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలపై 86, ఇతర సమస్యలపై 51 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్, శివరామిరెడ్డి, డీఎంహెచ్‌వో వాణీశ్రీ, మైక్రో ఇరిగేషన్ పీడీ జెన్నమ్మ, జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయాధికారి బాలాజీ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


