కంభం:
ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా సకాలంలో స్పందించిన పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన శనివారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఎల్.గౌతం మూడు నెలలుగా కంభంలో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో తాను చనిపోతున్నానని తన స్నేహితుడికి ‘ఐ మిస్ యూ’ అని మెసేజ్ పంపించాడు. అనుమానం వచ్చిన స్నేహితుడు 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకృష్ణారెడ్డి ఐటీ కోర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైల్వేస్టేషన్ సమీపంలో గౌతం ఉన్నట్లు గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడినందుకు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబరిచిన ఎస్సై, కంట్రోల్ రూమ్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గౌతం లండన్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. తనతో పాటు చదువుకున్న ఓ అమ్మాయిని ప్రేమించగా ఆ అమ్మాయి వివాహం మరొకరితో జరగడం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది.


