న్యూస్‌రీల్
ఒక్కొక్కరిది ఒక్కో ఆశయం.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో సుజాత ముందడుగు గ్రామీణ దురాచారాలపై జనాన్ని చైతన్యపరిచేలా సినిమా తీసిన నరసమ్మ విధి చిన్నచూపు చూసినా క్లౌడ్ కిచెన్‌తో హిమబిందు సక్సెస్ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు
ఒంగోలు టౌన్: విధి ఆమెను చిన్నచూపు చూసినా నిరాశ చెందలేదు. సమస్యలు చుట్టుముట్టినా వెన్ను చూపలేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. విజయాన్ని తన సొంతం చేసుకుంది. ఆమె పేరు బత్తల హిమబిందు. ఒంగోలులోని గోపాల్‌నగర్. 2017లో కృష్ణ సుమంత్‌తో వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. భార్యభర్తలిద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న జీవితంలో కరోనా మహమ్మారి కాటు వేసింది. కరోనా బారిన పడి భర్త సుమంత్ మరణించారు. దాంతో ఒక్కసారిగా చీకటి ఆవరించింది. ఒంటరితనం చుట్టుముట్టింది. ఇంకేముందని ఆవేదనకు గురైతే కోలుకోవడం కష్టం. ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూడాలి. వారికి బంగారు భవిష్యత్తు చూపాలి. గుండెల్లోంచి తన్నుకొస్తున్న బాధను తమాయించుకుని బతుకు బరిలోకి దిగింది. ఇంటి నుంచి బయటకు అడుగు వేయకుండానే హాట్ ఎన్ క్రిప్సీ పేరుతో క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసింది. నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణంతో నాణ్యమైన ఫ్రైడ్ చికెన్, వెజ్ స్నాక్స్, అమెరికన్, కాంటినెంటల్, ఇటాలియన్ పిజ్జాలు తయారు చేసి స్విగ్గి, జొమాటో ఆర్డర్ల ద్వారా విక్రయించడం మొదలు పెట్టింది. ఆమె బతకడమే కాకుండా మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తోంది.
ఆత్మస్థైర్యమే బలంగా..మొక్కవోని దీక్షతో తమ కలలను సాకారం చేసుకున్నారీ మహిళలు. వీరి సంకల్పానికి కుటుంబ సభ్యుల సహకారం తోడైంది. తాము అనుకున్నది సాధించి సగర్వంగా ముందుకు సాగుతున్నారు. రాళ్లు రప్పలున్న భూమినే ఎంచుకుని ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రకృతి వ్యవసాయం చేస్తూ ముందుకెళ్తున్నవారు ఒకరైతే.. గ్రామీణ ప్రాంతాల్లో దురాచారాలు, దేవదాసి వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనల నేపథ్యంలో సినిమా తీసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు మరొకరు. మాయదారి కరోనా భర్తను కబళించినా కుంగిపోకుండా స్వశక్తితో చిన్నపాటి ఫుడ్ బిజినెస్ ప్రారంభించి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు ఇంకొకరు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మణిరత్నాలపై ప్రత్యేక కథనం...


