దిగుమతి సుంకం ఎత్తేయడంతో దేశీయంగా రైతులు విలవిల ఎంఎస్‌పీ కంటే పడిపోయిన శనగ ధరలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో శనగ రైతులను ఆదుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం కూడాస్పందించాలని డిమాండ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవిబాబు
ఒంగోలు సబర్బన్: రాష్ట్రంలో శనగ పంట పండిస్తున్న రైతులందరూ తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు శనివారం కలెక్టర్ పి.రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు తదితర నాయకులు కలెక్టర్‌ను కలిసి శనగ రైతుల కష్టాలు వివరించారు. రాష్ట్రంతో పాటు జిల్లాలో ప్రధాన పంట అయిన శనగ రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో తెలియజేశారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ భారతదేశంలో 2019–20 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం సుమారు 11 నుంచి 12 మిలియన్ టన్నుల శనగ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో 70 శాతం కంటే ఎక్కువని తెలిపారు. దేశంలో వినియోగ అవసరం సంవత్సరానికి 10 నుంచి 10.50 మిలియన్ టన్నులు కాగా, ప్రతి సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ నిల్వలు సుమారు 1 నుంచి 2 మిలియన్ టన్నులు ఉంటున్నాయన్నారు. అయితే, కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం 2024 మే నెల సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ (ఎస్‌డబ్ల్యూఎస్) మినహాయించిందని, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగలకు సుంకం, సెస్ రద్దు చేయడం వల్ల దిగుమతులు 2023–24లో 1.64 లక్షల టన్నుల నుంచి 2024–25లో 15.06 లక్షల టన్నులకు తీవ్రంగా పెరిగాయని తెలిపారు. దిగుమతి సుంకం ఎత్తేయడంతో తక్కువ ధరకు విదేశీ శనగలు మార్కెట్లో లభ్యమవుతున్నాయన్నారు. తద్వారా దేశీయంగా మన రైతులు పండించిన శనగల ధర కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో బెంగాల్ గ్రామ్ రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యారన్నారు. గత సంవత్సరం ఉత్పత్తిలో లక్షల టన్నులు ఇప్పటికీ శీతల గిడ్డంగులలో మూలుగుతున్నాయని తెలిపారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసినట్లు కలెక్టర్‌కు మేరుగు నాగార్జున వివరించారు. మిర్చి రైతుల కష్టాలు కూడా వర్ణణాతీతంగా ఉన్నాయని, శనగ, మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు.
రెండేళ్ల నుంచి మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో శనగలు : చుండూరి రవిబాబు
వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన పంట శనగ అని, కానీ.. రెండేళ్ల నుంచి పండించిన శనగలకు మద్దతు ధరలు లేక కోల్డ్ స్టోరేజీల్లో మగ్గుతున్నాయని తెలిపారు. మరి ఈ సంవత్సరం కూడా శనగ పంట చేతికొచ్చే స్థితిలో విదేశాల నుంచి సుంకాలు లేకుండా దిగుమతవుతున్న శనగల వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శనగ రైతులు నష్టపోతుంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్వింటాకు రూ.1500 చొప్పున ఒక్కో రైతుకు 35 క్వింటాళ్లకు ఇచ్చి ఆదుకున్నారన్నారు. మిర్చి రైతు పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. ఇక పొగాకు రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందన్నారు. నేటికీ వేలం ప్రారంభం కాకపోవటంతో పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. సిగరెట్లపై సుంకం పెంచటంతో పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేయాలని కంపెనీలు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న శనగపై 2021 నుంచి 2023 సంవత్సరాల్లో ఉన్నట్లుగా వ్యవసాయ మౌలిక సదుపాయాల–అభివృద్ధి సెస్ (ఏఐడీసీ), సోషల్ వెల్ఫేర్ సర్‌చార్జ్ (ఎస్‌డబ్ల్యూఎస్) విధించాలని, లేదా ఏఐడీసీ, ఎస్‌డబ్ల్యూఎస్ పరిహారంగా ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సీజన్ ఉత్పత్తికి క్వింటాకు రూ.1000 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారుబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు భరోసా లేదన్నారు. అన్ని పంటల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


