ఆత్మస్థైర్యంతో కల నెరవేర్చుకుని... | - | Sakshi
Sakshi News home page

ఆత్మస్థైర్యంతో కల నెరవేర్చుకుని...

Mar 8 2026 7:25 AM | Updated on Mar 8 2026 7:25 AM

ఆత్మస్థైర్యంతో కల నెరవేర్చుకుని...

కొనకనమిట్ల: కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామానికి చెందిన చెన్నెబోయిన వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు దంపతులది వ్యవసాయ కుటుంబం. నరసమ్మకు సినిమాలు అంటే ఇష్టం. ఎలాగైనా సినిమా తీయాలని అనుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే దురాచారాలు, దేవదాసి వ్యవస్థలో జరిగే కొన్ని సంఘటనలు ఆమెకు భాద కలిగించేవి. తన మనసులో మాటను భర్త వెంకటేశ్వర్లుకు తెలిపింది. ఛా ఊరుకో.. మనకు పొట్టకోస్తే అక్షరం ముక్కరాదు.. వేలిముద్రగాల్లం.. అసలు సినిమా తీయాలంటే కోట్లు కావాలి.. నువ్వేమైన కలలు కంటున్నావా అని అనేవాడు. దీంతో కుమారుడు వెంకటరవీంద్రనాథ్‌తో తన కోరికను తెలియజేసింది వెంకట నరసమ్మ. అతను కూడా పెద్ద ఆసక్తి చూపించలేదు. ఎలాగైనా సినిమా తీయాలన్న దృఢ నిశ్చయంతో తనకున్న కొద్దిపాటి పొలాన్ని, మేకలను, గేదెలను అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు పెదారికట్లలో చిన్న హోటల్‌ పెట్టి కష్టపడి వచ్చిన ఆదాయం, కుమారుడి సహకారంతో సినిమా తీసింది. గ్రామీణ నేపథ్యంలో జరిగే కొన్ని సంఘటనలపై మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామని ఆమె అంటోంది. తెలంగాణ దేవదాసి వ్యవస్థలానే కోస్తాంధ్రలో మాతంగులు ఉండేవారు. గ్రామాల్లో జరిగే జాతరలు, ఉత్సవాల్లో మాతంగులు నృత్యాలు చేసేవాళ్లు. మాతంగుల దుర్భర జీవితాలను, కష్టాలను కళ్లారా చూశాం. వారి పిల్లలు మాతంగుల వృత్తిలోకి రాకుండా ఉండాలని, చదువుకుని మంచిగా రాణించాలనే ఉద్దేశంతో ‘స్పిరిట్‌’ (ఈజ్‌ నాట్‌ వన్‌) సినిమా తీశామంటోంది. ఈ చిత్రంలో నటించేందుకు సినీనటులు చిత్రం శ్రీను, రవిబాబు, సత్య ప్రకాష్‌, చిట్టిబాబు, రమ్య, ప్రియాంక, పింకితో పాటు నటులు రాజశేఖర్‌, సైదులు, నాగతేజ ముందుకు వచ్చారు. సినిమాకు తన కుమారుడు వెంకటరవీంద్రనాథ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ ఎయిర్‌ వండర్‌ సినిమా పతాకంపై తను నిర్మించిన ‘స్పిరిట్‌’ (ఈజ్‌ నాట్‌ వన్‌) సినిమాను త్వరలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామంటూ నిర్మాతగా మారిన వెంకట నరసమ్మ సంతోషం వ్యక్తం చేసింది. త్వరలో సినిమా విడుదలకు సన్నహాలు చేస్తున్నామని తెలిపింది. గతంలో గ్రామంలోని వాళ్లు, బంధువులు, స్నేహితులు మీరేంటి సినిమా తీసేది అంటూ కొంత హేళనగా మాట్లాడి ఎగతాళి చేశారు. ఇప్పుడు సినిమా పూర్తయిందని తెలుసుకుని ఆనాడు ఎగతాళి చేసిన వాళ్లే నేడు గౌరవంగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నారని గర్వంగా చెబుతోంది. సినిమాలో తాను, తన చిన్న కుమారుడు కూడా నటించామని, సినిమా తీస్తున్న సమయంలో పాము కాటుకు గురై తన చిన్న కుమారుడు మృతి చెందటం కలచివేసిందని నరసమ్మ భర్త వెంకటేశ్వర్లు ఆవేదన చెందారు. ఆ విషాదం నుంచి కోలుకుని మళ్లీ సినిమా తీశామని తెలిపారు.

హోటల్‌ నిర్వహిస్తున్న వెంకట నరసమ్మ

స్పిరిట్‌ (ఈజ్‌ నాట్‌ వన్‌) సినిమాను ఆదరిస్తాం...

తమ గ్రామానికి చెందిన ఓ సాధారణ కుటుంబం సినిమా తీయడం సంతోషంగా ఉందని, ఆ సినిమాను ఆదరిస్తామని పెదారికట్ల గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంత వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఇటీవల నిర్మాతలైన వెంకట నరసమ్మ, వెంకటేశ్వర్లు, దర్శకుడు వెంకట రవీంద్రనాథ్‌ను కళావేదిక తరఫున సన్మానించారు. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సినీనటులు శ్రీకాంత్‌, సుమన్‌, ఆలీ, బాబుమోహన్‌తో పాటు పలువురు దర్శకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement