మహిళా దినోత్సవంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
చీమకుర్తి: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ మహారాణుల్లా జీవిస్తున్నారని, ప్రతిభా నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం రావడం, విద్యాసంస్థలకు సెలవు దినం కావడంతో చీమకుర్తిలోని బీవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో శనివారం ముందస్తుగా మహిళా దినోత్సవం నిర్వహించారు. కాలేజీ అధ్యాపకులు, విద్యార్థినులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయ, సాంకేతిక, సామాజిక, వ్యాపార, ఇతర అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో మహిళలంతా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. తొలుత కాలేజీ విద్యార్థినులతో కలిసి కోలాటం ప్రదర్శించి ఆకట్టుకున్నారు.


