ఒంగోలు టౌన్: లెప్రసీని నివారించడంలో పీహెచ్‌సీ వైద్యులు భాగస్వాములు కావాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ అధికారి డాక్టర్ బాలాజీ పిలుపునిచ్చారు. పీహెచ్‌సీ వైద్యులందరూ లెప్రసీ వ్యాధిపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులకు స్థానిక జీజీహెచ్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ వైద్యులు, ఫార్మసిస్ట్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ జిల్లా నుంచి లెప్రసీని పారదోలేందుకు సహకరించాలని కోరారు. లెప్రసీని గుర్తించిన వెంటనే తగిన వైద్యం అందించాలని సూచించారు. క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకునేలా రోగికి అవగాహన కల్పించాలని చెప్పారు. జీజీహెచ్ చర్మవ్యాధుల విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ రాజశేఖర్, డీఎఫ్‌ఐటీ ప్రాజెక్టు మేనేజర్ ఎస్.సతీష్, ఫిజియోథెరపిస్ట్ పీటర్, పీఎంఓ టి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


