ఒంగోలు టౌన్: ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ గంజాయి పట్టుబడింది. మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం మాదక ద్రవ్యాలను గుర్తించే జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసరాలు, పార్సెల్ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నుంచి కావలి వైపు వెళుతున్న ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పద వ్యక్తులు తారసపడ్డారు. వారి బ్యాగులను పరిశీలించగా 1.2 కిలోల గంజాయి లభ్యమైంది. ఒడిశా రాష్ట్రంలోని జేక్ పూర్ గ్రామానికి చెందిన మచ్చా భూను అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో ఎస్సైలు శ్రీరాం, చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ బొమ్మ వద్ద శుక్రవారం నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీటీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర దేవా సహాయం మాట్లాడుతూ 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, పెండింగ్ ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రే వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి మద్దిరాల శరత్ చంద్రబాబు, జిల్లా గౌరవ అధ్యక్షుడు పారబత్తెన జాలరామయ్య, జిల్లా నాయకులు జగన్నాథం ప్రసాదరావు, చెక్క కోటేశ్వరరావు, పల్లె కృష్ణమూర్తి, నూకతోటి కుమారస్వామి, పల్లె తిరుపతిస్వామి, కొండమూరి కొండల రాయుడు, గాలిమోటు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కొత్తపట్నం: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కె.పల్లెపాలెంలో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే..పెదగంజాం పల్లెపాలెం గ్రామానికి చెందిన కొల్లాటి వెంకట గోపి (30) బేల్దారీ పనులు చేసేవాడు. మండలంలోని కె.పల్లెపాలెం గ్రామానికి తిరుపమ్మతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన గోపి భార్యను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కె.పల్లెపాలెం వచ్చాడు. నాలుగు రోజుల క్రితం కుటుంబసభ్యులంతా తిరుపతమ్మ తిరునాళ్లకు వెళ్లారు. అయితే గోపీ మాత్రం తిరునాళ్లకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇంట్లోని వారంతా తిరునాళ్లకు వెళ్లి వచ్చే సరికి బీరువా పగులగొట్టి అందులోని నగదు దొంగిలించి మద్యం తాగాడు. కుటుంబసభ్యులు గ్రామంలో వెతికి పట్టుకున్నారు. అయితే ఇప్పుడు వస్తానని బయటకు వెళ్లిన గోపీ తుఫాన్ షెల్టర్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
త్రిపురాంతకం: నేషనల్ హైవేపై బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. త్రిపురాంతకంకు చెందిన కాశీం (62) హైవేలో ఉన్న తన హోటల్ వద్ద నుంచి బైక్‌పై వచ్చే క్రమంలో ఎదురుగా శ్రీశైలం నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు ఢీకొట్టింది. ప్రమాదం కాశీం తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్రిపురాంతకం: చెరువుకొమ్ముతండా గ్రామ పరిధిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహం గుర్తించినట్లు ఎస్సై శివరామయ్య తెలిపారు. త్రిపురాంతకం మండలం సంఘంతండా పంచాయతీ పరిధిలోని చెరువుకొమ్ముతండా పరిసర ప్రాంతంలోని పొలంలో సుమారు 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. తెలుపు రంగు చొక్కా ధరించి ఉండగా ఇతని వద్ద ఎరుపు రంగు దుప్పటి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


