అబద్ధాలకు
పుల్లలచెరువు: రాష్ట్ర అభివృద్ధిని మరిచి కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటుగా మారిందని, అరాచక పాలన సాగిస్తున్నారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మండలంలోని ముటకుల గ్రామంలో సంతాన వేణుగోపాలస్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేలా రాష్ట్ర ప్రజల ఆశీస్సులు మెండుగా ఇవ్వాలని ఆ దేవున్ని మొక్కినట్లుగా తెలిపారు. అనంతరం వైఎస్సాఆర్ సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై ఆశేష జనవాహిని మధ్య ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడారు.
రాష్ట్రంలో ఆరాచక పాలన
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అభివృద్ధిని మరిచిపోయి అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు రాష్ట్రంలో జనరంజక పాలన సాగించారని గుర్తుచేశారు. ప్రస్తుత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారని, కేవలం వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌కల్యాణ్‌లు విహారయాత్రల పేరుతో విమానాల్లో తిరుగుతూ కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా అబద్ధపు మాటలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని వదిలేశారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ కునారిల్లుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి మంచి చేశాందో నాయకులు చెప్పాలన్నారు.
ఆలయ ప్రతిష్టను కాపాడలేని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవా..?
తిరుపతి లడ్డూ విషయంలో పదే పదే అబద్ధాలు వల్లె వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు చూస్తున్నారని, కానీ ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆలయ ప్రతిష్టను కాపాడలేని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవిని ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. సీ్త్ర లోలుడు అయిన బీఆర్ నాయుడుకు చైర్మన్ పదవిని ఇచ్చి తిరుమల ఆలయ ప్రతిష్టను మంట కలిపారని విమర్శించారు. బీఆర్ నాయుడు చేస్తున్న పనులను గురించి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి వదిలేసి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబును త్వరలో సాగనంపాలని, రాష్ట్రంలో జరిగే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటాని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ ఎల్, రాములు, సర్పంచ్‌లు సత్యనారాయణరెడ్డి, ఆవుల కోటిరెడ్డి, జె, వెంకటరెడ్డి, ఆవుల రమణారెడ్డి, బోల్లేపల్లి సాంబయ్య, శేషయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ, గద్దె బ్రహ్మయ్య, రవణారెడ్డి, మండల మహిళా అధ్యక్షరాలు రవణమ్మ, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గంగరాజు, దినేష్‌యాదవ్, ఆవులయ్య, బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ పథకాల అమలు ఎక్కడ బాబు..?
ఊకదంపుడు మాటలు తప్ప
అభివృద్ధి శూన్యం
రాష్ట్రంలో అరాచక పాలన
ముటుకుల తిరునాళ్లలో
ఎమ్మెల్యే చంద్రశేఖర్ ధ్వజం


