కదలని గ్రానైట్‌ బ్లాక్‌లు | - | Sakshi
Sakshi News home page

కదలని గ్రానైట్‌ బ్లాక్‌లు

Mar 7 2026 7:19 AM | Updated on Mar 7 2026 7:19 AM

సింగరాయకొండ: మద్యం మత్తులో లారీ అతివేగంగా నడపడంతో భారీ గ్రానైట్‌ బ్లాక్‌లు రోడ్డుపై అడ్డంగా పడిన విషయం విదితమే. బల్లికురవ నుంచి బెంగళూరుకు రవాణా చేస్తుండగా స్థానిక పెరల్‌ డిస్టిలరీ సమీపంలో రోడ్డుపై గ్రానైట్‌ బ్లాక్‌లు పడ్డాయి. అయితే ఈ గ్రానైట్‌ బ్లాక్‌లను తిరిగి ట్రాలీపై ఎక్కించడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జాతీయరహదారి అధికారులు టంగుటూరు, గుండ్లాపల్లి టోల్‌ప్లాజాల నుంచి మూడు భారీ ట్రాలీలను తీసుకువచ్చారు. గ్రానైట్‌ బ్లాక్‌లను రోడ్డుకు అడ్డంగా లేకుండా డివైడర్‌ మధ్యలోకి జరిపే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రేన్‌లు సుమారు 30 టన్నుల బరువు ఎత్తే సామర్థ్యం ఉండగా గ్రానైట్‌ బ్లాక్‌లు 50 టన్నులకు పైగా బరువు ఉన్నాయి. దీంతో ఆ బ్లాక్‌లను పక్కకు జరపడానికి కుదరలేదు. వాటిని పక్కకు నెట్టే క్రమంలో క్రేన్‌ల చైన్లు తెగిపోయాయని లారీ యజమానులు వాపోతున్నారు. దీంతో చివరికి క్వారీ యజమానితో సంప్రదించి విజయవాడ నుంచి భారీ క్రేన్‌లు తెప్పించనున్నట్లు జాతీయరహదారి అధికారులు తెలియజేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం...

జాతీయరహదారిపై పెట్రోలింగ్‌ నిర్వహించాల్సిన హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, జాతీయరహదారి భధ్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తృటిలో ఘోర ప్రమాదమే తప్పింది. ట్రాలీ సామర్‌ాధ్యన్ని మించి అధిక లోడింగ్‌తో రవాణా జరుగుతుండగా పట్టించుకోవాల్సిన బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌లు పత్తాలేరు. డ్రైవర్‌ ఒంగోలులో మద్యం సేవించి అతివేగంగా, అజాగ్రత్తగా ట్రాలీ నడుపుతుంటే పర్యవేక్షించాల్సిన హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, జాతీయ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కాని ప్రశ్న. చివరికి పెరల్‌ డిస్టిలరీ సమీపంలో ఈ భారీ గ్రానైట్‌ బ్లాక్‌లు జారి కిందపడి అవతల రోడ్డు వైపుకు వెళ్లాయి. ఆ సమయంలో వాహనాల సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదే కనుక ప్రైవేట్‌ బస్సు, కారు వచ్చి ఉంటే ఈ ఘటనను ఊహించడమే కష్టం. ఈ ఘటనతో అధికారులు స్పందించి జాతీయరహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

మూడు క్రేన్‌లతో గ్రానైట్‌ బ్లాక్‌ల

తొలగింపునకు చర్యలు

ఫలించని హైవే అధికారుల కృషి

విజయవాడ నుంచి భారీ క్రేన్‌లు

వస్తాయంటున్న హైవే అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement