ఒంగోలు సబర్బన్: రీ సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకాశం భవన్‌లోని సర్వే ఏడీ కార్యాలయం ముందు పెన్‌డౌన్ చేసి నిరసనకు దిగారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాల కృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు రీసర్వే పూర్తయిన గ్రామాల రైతులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేసి వారి అభిప్రాయాల ఆధారంగా మాత్రమే తదుపరి రీ సర్వే ప్రాజెక్ట్‌పై ముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుతం నాల్గవ విడత రీసర్వే గ్రామాల్లో రోజుకు ఒక టీం 25 ఎకరాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలతో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని వాపోయారు. పనిభారంతో మానసికంగా తీవ్ర ఒత్తికి లోనవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వే ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యే వరకు స్వామిత్వ ప్రాజెక్ట్‌లో మేము భాగస్వాములం అవ్వలేమని తెగేసి చెప్పారు. అధిక పనిభారం కారణంగా అర్ధరాత్రి వరకు పనిచేయడం వల్ల గ్రామ సర్వేయర్లు ప్రయాణాల్లో ప్రమాదాలకు గురవుతున్నారని వివరించారు. పదోన్నతులు కల్పించి ఆదుకోవాలన్నారు. పే స్కేలు అంశాలను పరిష్కరించాలన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: గ్రామ సర్వేయర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని శుక్రవారం నిరసనకు దిగారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలతో పాటు రిక్రూట్ అయిన ఇతర ఉద్యోగుల మాదిరిగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన గ్రామ సర్వేయర్లకు జిల్లా వారీగా 70 శాతం వరకు గ్రేడ్ 1 ప్రమోషన్లు, రూ.34,580 బేసిక్ స్కేల్ అమలు చేయాలని కోరారు. గ్రామ సర్వేయర్ గ్రేడ్ 1కు మండల డిప్యూటీ సర్వేయర్‌కు మధ్య స్పెషల్ సర్వేయర్ పోస్టు సాంకేతిక విభాగ సమాన పేరోల్ కనీసం రూ.37,640 బేసిక్ అమలు చేయాలన్నారు. ఐదేళ్లుగా పై స్థాయి నుంచి మండల సర్వేయర్ పోస్టు వరకు పదోన్నతులు వస్తున్నాయని, కానీ విలేజ్ సర్వేయర్లకు మండల డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు స్పెషల్ గ్రేడ్ సర్వే పోస్టులకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 ఎటువంటి పదోన్నతులు రావడం లేదని, త్వరితగతిన ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
డిమాండ్ల సాధన కోసం సర్వే ఏడీ కార్యాలయం ముందు సర్వేయర్ల నిరసన


