పెద్దదోర్నాల: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం కర్నూలు రోడ్డులోని మోట్ల మల్లికార్జునపురం సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ద్విక్రవాహనంపై ప్రయాణిస్తున్న కర్నూలు జిల్లా బోమన చెరువుకు చెందిన బెస్త శరత్‌కుమార్ (25) మృతి చెందగా, మరో యువకుడు దేవేంద్రకుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై వెంకట రమణయ్య కథనం మేరకు..కర్నూల్ జిల్లా బోమనచెరువుకు చెందిన బెస్త శరత్‌కుమార్, దేవేంద్రకుమార్ హైదరాబాద్ నుంచి పల్నాడు జిల్లా మాచర్లలలో స్నేహితులను కలిసేందుకు వచ్చారు. స్నేహితులను కలిసిన అనంతరం మాచర్ల నుంచి డ్రోన్‌కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మోట్లమల్లికార్జునపురం వద్దకు రాగానే ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వెంకట రమణయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


