విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు ఒంగోలు అసెంబ్లీ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు
ఒంగోలు సిటీ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందని, విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేసి చంద్రబాబు అండ్ కో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తే నేడు వాటిని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారన్నారు. జిల్లాలో శనగ రైతు పూర్తిగా దెబ్బతిన్నాడని, మద్దతు ధర లేక సరుకును కోల్డ్‌స్టోజీల్లో ఉంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతు పరిస్థితి కూడా దారుణంగా ఉందని, మా ప్రభుత్వ హయాంలో ధరలు తగ్గకుండా చూశామన్నారు. రైతులకు ఈ ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని తీసేసిందని ఆరోపించారు. మిర్చి రైతులను సైతం ముంచేశారన్నారు. చంద్రబాబు పాలన అంతా విధ్వంసమేనని విమర్శించారు. డెత్ సర్టిఫికెట్ పొందాలన్నా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రెవెన్యూ విభాగం అవినీతి మయమైందన్నారు. లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఇదేనా సుపరిపాలనా అని ఆయన నిలదీశారు. వెలిగొండ ఫీడర్ కాలువ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా మార్కాపురంలో నిర్వహించిన సభలో ‘‘తమ్ముళ్లూ నేను ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తానా? ఆడిన మాట తప్పుతానా? అబద్దాలు ఆడతానా’’ అని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని ఆయన ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పథకాలు నేడు అమలు అవుతుంటే వాటిని మీ ఖాతాల్లో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కళాశాలను కట్టడం మీకు చేతనైందా అని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రై వేటుకు అప్పగించడం సరికాదన్నారు.విలువైన ప్రభుత్వ స్థలాలను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కారుచవగ్గా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు.
తిరుమల లడ్డూపై రాజకీయాలా..?
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో రాజకీయాలు, అసత్య ప్రచారాలు చేస్తోందని చుండూరి మండిపడ్డారు. దేవుడి ప్రసాదాన్ని అప్రతిష్టపాలు చేశారన్నారు. జగన్ హయాంలో దేశం నలుమూలల టీటీడీ ఆధ్వర్యంలో గుడులు కట్టారని, దళితవాడల్లో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించారని గుర్తు చేశారు. మీరు మాత్రం బోలేబాబాలతో మిలాఖత్ అయి నెయ్యి విషయంలో మోసం చేస్తున్నారని ఆరోపించారు. స్వామి అంటే మీకు భక్తిలేదని ధ్వజమెత్తారు. పవన్ కషాయ వస్త్రాలు వేసి సనాతన ధర్మం పేరుతో డ్రామాలు ఆడారని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లీలలపై ఎందుకు పవన్ స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ నాయుడు సైతం తగ్గేదేలే అన్నారు. దేవుడి దగ్గర ఉన్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పార్టీ బలోపేతం..
నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సహకారంతో నియోజకవర్గంలో కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని చుండూరి రవిబాబు తెలిపారు. మెప్మా అవినీతి వెలుగులోకి వచ్చి మూడు నెలలైందని, అప్పటి జేసీ చేసిన విచారణ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ నగర్ బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి మీద చేసిన జనసేన నాయకుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన్ను జైలులో వేస్తే సంతోషిస్తాను అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్నారు. బొమ్మినేని మురళిని దామచర్ల జనార్దన్ అనుచరుడు రాము కొట్టాడనీ, కేసులు కట్టారనీ, ఎవరివీ అరెస్ట్‌లు లేవన్నారు. రిమ్స్ ఆస్పత్రి వద్ద, వెంగముక్కలపాలెం వద్ద కొట్లాటలు జరిగాయన్నారు. మొత్తం 94 మంది మీద కేసులు పెట్టారన్నారు. చార్జిషీట్‌లో దామచర్ల, బాలినేని, ప్రణీత్, మధు, మాల్యాద్రి, పేర్లు తీసేశారని, మిగిలిన 94 మంది మీకోసం జైలుకు వెళ్లాలా అని ప్రశ్నించారు. మీ ఇద్దరు ఒకటీ మేము ఒకటా అన్నారు. అన్ని సమస్యల మీద వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పోరాడుతున్నామన్నారు. 5 వేల మంది పార్టీలో పనిచేయడానికి ముందుకు వచ్చారన్నారు. మా పాలనలో ట్రాక్టరు ఇసుక రూ.3 వేలు అయితే ఇప్పుడు ట్రాక్టరు రూ.5 వేలు అని, డబ్బంతా ఎటు పోతోందని విమర్శించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, వైఎస్సార్ సీపీ నాయకులు గౌతమ్ అశోక్, రొండా అంజిరెడ్డి, సీఎం వెంకటేశ్వరరెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, పేరం ప్రసన్న, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


