● అంగన్‌వాడీలు అరెస్టును ఖండించిన ప్రగతిశీల మహిళా సంఘం
ఒంగోలు టౌన్: శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలను మహిళలన్న విజ్ఞత లేకుండా అమానుషంగా ఈడ్చుకెళ్లడం దుర్మార్గమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి ఖండించారు. న్యాయమైన హక్కుల సాధన కోసం ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ యూనియన్ నాయకుల అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ స్థానిక ఎల్బీజీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మహిళలన్న కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఽఅర్దరాత్రి ధర్నా శిబిరం వద్దకు వచ్చి లైట్లు ఆపేసి, టెంట్లు కూల్చేయడం, మేము ఉగ్రవాదులం కాదు, ఉద్యమకారులం అని చెబుతున్నా వినకుండా పురుష పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం, చివరికి వాష్ రూంలకు వెళ్లి వస్తామన్నా వినకుండా దురుసుగా వ్యవహరించడం కిరాతకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారని, వాగ్దానాలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. నిరసనలో ఐద్వా నాయకులు జి.ఆదిలక్ష్మి, ఉమా మహేశ్వరి, కె.రాజేశ్వరి, జి.కళ్యాణి, బి.రంగమ్మ, జి.నాగేశ్వరమ్మ, ఎస్.జ్యోతి, వై.అంజనీదేవి పాల్గొన్నారు.


