ఒంగోలు టౌన్:
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వీబీ జీ రాంజి పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చిన మోదీ సర్కార్ గ్రామీణ ప్రజల కడుపు కొట్టేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు విమర్శించారు. జీ రాంజీ పథకంలో ఏడాదిలో 125 రోజలు పనిదినాలు కల్పిస్తున్నట్లు చెబుతున్న మోదీ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులను మాత్రం కేటాయించలేదని చెప్పారు. ఈ పథకం అమలుకు 2.30 లక్షల కోట్ల రూపాయలు అవసరం కాగా కేవలం 95 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతదంగా కొనసాగించాలని, వీబీ జీ రాంజీ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను కేటాయిస్తుండగా ఇప్పుడు అమలు చేయనున్న కొత్త పథకంలో కేవలం 60 శాతం నిధులను కేంద్రం, మిగతా 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలని చెప్పడం మసిపూసి మాయ చేయడమేనన్నారు. ఆంధ్ర రాష్ట్రం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఇటీవల బడ్జెట్లో రూ.3,346 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు ఉపాధి కూలీలకు 125 రోజుల పని ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. హక్కులు, నిధులు లేని వీబీ జీ రాంజీ పథకాన్ని గ్రామీణ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ.. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అత్యధికంగా 58 శాతం నిరుపేద మహిళలు, 19 శాతం దళితులు, 18 శాతం గిరిజనులు పనిచేస్తున్నారని వివరించారు. ఈ పథకాన్ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, ధనిక వర్గాలకు ఉపయోగం కలిగేలా వీబీ జీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు. మోదీ విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వీబీ జీ రాంజీ పథకం రాష్ట్రాలపై మోయలేని భారం మోపుతోందంటూ అరుణోదయ సంస్థ ఏర్పాటు చేసిన దృశ్యమాలిక అందరినీ ఆలోచింపజేసింది. ధర్నాలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.మంజుల, ఎస్.భారతి, రైతు కూలీ సంఘం నాయకులు హనుమంతరావు, చంద్రశేఖర్, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు జాలన్న, సీపీఐ న్యూ డెమోక్రసీ నాయకులు సీఎస్ సాగర్, ఎల్.రాజశేఖర్, సీహెచ్ పద్మ, కృష్ణారావు, సీతారావమ్మ, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.


