● యువకునిపై పోక్సో కేసు నమోదు
హనుమంతునిపాడు: మండలంలోని రశీదుపురంలో 14 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన యువకునిపై పోక్సో కేసు నమోదైంది. ఈ సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. రశీదుపురం గ్రామానికి చెందిన మేకల సుబ్బయ్య కుమారుడు మేకల నాగార్జున్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించి చేయి పట్టుకొని చెట్లలోకి లాగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు యువకునిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం మాధవరావు తెలిపారు.
ఒంగోలు టౌన్: జనసేన సభ్యత్వ నమోదులో భాగంగా ఏర్పాటు చేసిన ఉద్యమి సమావేశానికి మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దూరంగా ఉన్నారు. సోమవారం రవిప్రియమాల్‌లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాలినేని వర్గం దూరంగా ఉందన్న విషయం తెలుసుకుని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ బాలినేని ఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం కొణతాల మీడియాతో మాట్లాడి సమావేశానికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
బేస్తవారిపేట: అంతర్జాతీయ పారా త్రోబాల్ చాంపియన్‌షిప్‌కు బేస్తవారిపేట మండలంలోని ఆర్.కొత్తపల్లెకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు పండుగల రాయుడు ఎంపికయ్యాడు. ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో నిర్వహించిన నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో ఏపీ జట్టు విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన రాయుడు మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 20 నుంచి 25 వరకు నిర్వహించనున్న రెండో ఏషియన్ ఇంటర్నేషనల్ పారా త్రో బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు సెలక్ట్ అయ్యాడు. ఈ మేరకు పారా త్రోబాల్ అసోసియేషన్ ఇఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు అందాయి.
టంగుటూరు: రైలు కిందపడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన టంగుటూరు రైల్వేస్టేషన్ సమీపంలోని 193 రైల్వే గేట్ వద్ద సోమవారం జరిగింది. ఒంగోలు రైల్వే పోలీసులు, టంగుటూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు..టంగుటూరు రైల్వేస్టేషన్ ఉత్తర పక్కన రైల్వే ఎల్‌సీ గేట్ 193 దిగువ లైన్ వద్ద గుర్తు తెలియని వృద్దురాలి మృతదేహం పడి ఉంది. రైల్వేస్టేషన్ డ్యూటీ స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై టి.శ్రీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు.


