● ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశం
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం వేదికలో 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు బాధితులు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అత్తారింటి వేధింపులు, ఉద్యోగ మోసాలపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. చట్టపరిధిలో విచారణ చేసి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..మీ కోసం ఫిర్యాదులపై తక్షణమే విచారణ ప్రారంభించాలని సూచించారు. జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని చెప్పారు. బాధితులకు నమ్మకం కలిగేలా నిర్ణీత గడువు లోగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పోలీసు మీ కోసంలో ఫిర్యాదులు చేసేందుకు ఒంగోలు వరకు రాలేని బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, కందుకూరు సీఐ అన్వర్‌బాషా, చీమకుర్తి సీఐ ప్రసాద్, మీ కోసం ఎస్సై జనార్దన్‌రావు, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్, సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం పోలీస్ గ్రీవెన్స్‌కు 32 అర్జీలు
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 32 అర్జీలు అందినట్లు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల నుంచి వచ్చిన పలువురు అర్జీదారులతో మాట్లాడి సమస్యల పూర్వాపరాలు తెలుసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి అర్జీలను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ కేసులు, ఉద్యోగ మోసాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ సురేష్, కంభం సీఐ కె.మల్లికార్జునరావు సిబ్బంది పాల్గొన్నారు.
కందుకూరు రూరల్: పాత కక్షల నేపథ్యంలో దాడి చేశారని మనస్తాపం చెందిన ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఓగూరులో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..కందుకూరులోని ఆనందపురంకు చెందిన కె.మాధవరావు ట్రాక్టర్ల ఫైనాన్స్‌లో పని చేస్తుండేవాడు. ఆ పనిపై సుమారు రెండేళ్ల క్రితం కారులో ఓగూరు గ్రామానికి వెళ్లాడు. రోడ్డులో కారు అడ్డంగా పెట్టావని ఓగూరు గ్రామానికి చెందిన ఏ.వరుణ్ సాయి మాధవరావు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వరుణ్ సాయి మాధవరావును కొట్టి కారు అద్దాలు పగలగొట్టాడు. దీంతో అప్పుడు మధ్యవర్తులు మాట్లాడి సరిచేసి పంపారు. అప్పటి నుంచి కె.మాధవరావు వరుణ్ సాయిపై కక్షపెట్టుకొని ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం వరుణ్ సాయి తన స్నేహితుడితో కలిసి కందుకూరులోని ఓ మద్యం షాపుకు వెళ్లి మద్యం సేవిస్తున్నారు. అక్కడే మద్యం సేవిస్తున్న మాధవరావు, మరో నలుగురు కలిసి వరుణ్ సాయిపై దాడి చేసి, కొట్టి గాయపరిచారు. అక్కడ నుంచి బయటపడిన వరుణ్ సాయి ఇంటికి వచ్చి బంధువులకు చెప్పారు. మాధవరావు అనే వ్యక్తి నన్ను చేస్తాడని కుటుంబ సభ్యులతో, బంధువుల వద్ద వాపోయాడు. అనంతరం మనస్తాపానికి గురైన వరుణ్ సాయి (22) తన చావుకి కారణంగా ఆనందపురంకు చెందిన మాధవరావు అని ఫోన్ సెల్ఫీ వీడియో తీసుకొని ఫోన్ అక్కడే పెట్టి ఊరిలోనే ఉన్న పాడుపడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కంభం: మండలంలోని తురిమెళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని సిట్టింగ్ స్క్వాడ్ డీబార్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సోనీ తెలిపారు. ప్రథమ సంవత్సరం బ్యాక్ లాగ్ పరీక్ష రాస్తున్న విద్యార్థి కాపీయింగ్ చేస్తున్నట్లు గుర్తించిన సిట్టింగ్ స్క్వాడ్ సదరు విద్యార్థిని డీబార్ చేసినట్లు తెలిసింది.
సీఎస్‌పురం(పామూరు): మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం వద్ద వివిధ రకాల దుకాణాలు, ఇతరాల నిర్వహణకు సంబంధించి వేలం నిర్వహించగా వేలం ద్వారా రూ.31,84,700 ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ తెలిపారు. సోమవారం దేవదాయ, ధర్మాదాయ శాఖ కందుకూరు డివిజన్ ఇన్‌స్పెక్టర్ జి.ఏ.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈఓ, ధర్మకర్తల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో దుకాణాలు, ఇతరాలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2027 మార్చి 31 వ తేదీ వరకు నిర్వహించుకునేందుకు వేలం వేశారు. తలనీలాలు పోగు చేసుకునేందుకు రూ.18,11,700, టోల్‌గేట్ నిర్వహణకు రూ.5.71 లక్షలు, కొబ్బరి చిప్పలు పోగుచేసుకునేందుకు రూ.4.22 లక్షలు, కూల్‌డ్రింక్స్ దుకాణం నిర్వహణకు రూ.2 లక్షలు, క్యాంటిన్, మిఠాయిల కోసం రూ.1.80 లక్షలు ఆదాయంగా వచ్చినట్లు ఈఓ, ధర్మకర్త తెలిపారు.


