అర్జీల పరంపర.. సమస్యల మొర | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరంపర.. సమస్యల మొర

Mar 3 2026 9:15 AM | Updated on Mar 3 2026 9:15 AM

● తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామ రెవెన్యూ సర్వే నం.273/3లో తనకు చెందిన 2.50 ఎకరాల భూమిని ఇతరులు అక్రమంగా ఆన్‌లైన్‌ చేయించుకున్నారని సయ్యద్‌ మహబూబ్‌ వలి వాపోయాడు. గ్రామానికి చెందిన ఎస్‌కే మహమ్మద్‌ ఖాశీం తన తల్లి బడెఖాశీంబీ పేరు మీద 2016లో వీఆర్‌ఓ సహాయంతో ఆన్‌లైన్‌ చేయించి నకిలీ పట్టాదారు పాసు పుస్తకం పొందాడని జేసికి వివరించారు. సదరు పొలాన్ని అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నానని, రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ● మార్కాపురం మండలంలోని తూర్పుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నుంచి గత ఏడాది సెప్టెంబర్‌ 15న డీప్‌బోరుకు రూ.2 లక్షలు, రూ.4 లక్షలతో సీసీ రోడ్లు, మాలపాటిపల్లిలో సీసీ రోడ్డుకు రూ.2 లక్షలు మంజూరు కాగా ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ లేనందున స్పెషల్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్యదర్శి శాంక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడం లేదని ఎంపీటీసీ ఎం.శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. ● గజ్జలకొండ పంచాయతీలో 2 లక్షల నిధులతో బోరు ఏర్పాటుకు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కాగా సర్పంచ్‌ లేనందున స్పెషల్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్యదర్శి శాంక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడం లేదని ఎంపీటీసీ జె.రమేష్‌ జేసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ● 2019లో కంటి క్యాన్సర్‌ సోకి ఒక కన్ను కోల్పోయానని, సదరం సర్టిఫికెట్‌ కలిగి ఉన్నా పింఛను మంజూరు చేయడం లేదని మార్కాపురం పట్టణానికి చెందిన ఎస్‌కే సుబ్బయ్య అర్జీ అందజేశారు. ఒక కన్ను కోల్పోయి ఏ పనీ చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ● మార్కాపురం జిల్లాకు కాటంరాజు మార్కాపురం జిల్లాగా పేరు మార్చాలని కోరుతూ పీఎల్‌పీ యాదవ్‌ అర్జీ అందజేసి విన్నవించారు.

మార్కాపురం టౌన్‌:

క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. రోజులు, నెలల తరబడి మండల కేంద్రాల్లో అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన బాధితులంతా జిల్లా కలెక్టరేట్‌లో లిఖితపూర్వకంగా అర్జీలు అందజేశారు. తమ సమస్యలను జిల్లా అధికారులకు వివరించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సోమవారం ప్రకాశం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు 281 అర్జీలు, మార్కాపురం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు 83 అర్జీలు అందాయని ఆయా కార్యాలయాల అధికారులు వెల్లడించారు. మార్కాపురంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీ పులి శ్రీనివాసులు, జిల్లా గనుల శాఖ ఏడీ పోలిరెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్‌ పీడీ జెన్నెమ్మ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ సురేష్‌బాబు, ఆర్డీఓ ప్రభాకర్‌, ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌కు గైర్హాజరైతే వేటు తప్పదు

మార్కాపురం జేసీ హెచ్చరిక

మార్కాపురం జిల్లాలోని ప్రతి మండలంలో రెవెన్యూ సమస్యలపై అర్జీలు అధికంగా వస్తున్నాయని తహసీల్దార్‌లు, సిబ్బంది దృష్టి సారించి వేగంగా పరిష్కరించాలని జాయింట్‌ కలెక్టర్‌ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి జేసీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవిన్యూ సమస్యలపై పదే పదే అర్జీలు వస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గైర్హాజరైన కొందరు అధికారులకు ఫోన్‌ చేసి ఆహ్రహం వ్యక్తం చేశారు. మరోసారి నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. ఇకపై జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వారంలో మంగళ, గురు, శనివారాల్లో పట్టణాలు, గ్రామాల్లోని వైద్యశాలలు, ప్రభుత్వ పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రాలు, అన్నా క్యాంటీన్‌, ఆర్టీసీ బస్టాండ్లను తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ పధకాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీల్లో కొన్ని..

రెవెన్యూ గ్రీవెన్స్‌కు ప్రకాశంలో 281, మార్కాపురంలో 83 అర్జీలు

సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని జేసీల ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement