● పాఠశాల విద్య జేడీ ఎన్.గీత
కనిగిరి రూరల్: పబ్లిక్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్, పరీక్షల రాష్ట్ర పరిశీలకురాలు ఎన్.గీత పేర్కొన్నారు. కనిగిరి బాలికోన్నత పాఠశాల, చింతలపాలెం పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ రాజాల కొండారెడ్డితో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా గిద్దలూరు, వైపాలెం, మార్కాపురం, కనిగిరి పట్టణాల్లో 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2,909 మంది పరీక్షలు రాస్తున్నట్లు వెల్లడించారు. పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సిబ్బంది నియామకం పూర్తయిందని తెలిపారు. అనంతనం కనిగిరి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు.


