ఒంగోలు సబర్బన్: ఒంగోలు కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 281 అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వచ్చిన అర్జీలను నేరుగా గడువు లోగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లీనిక్‌ల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువు లోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆదేశించారు. పరిష్కరించకుంటే ఎందుకు పరిష్కరించలేదో అర్జీదారులకు సవివరంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్‌రెడ్డి, మాధురి, కళావతి, విజయజ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


