మద్యం దుకాణంలో చోరీ
● రూ.1.75 లక్షలు అపహరించిన దుండగులు
నాగులుప్పలపాడు: మద్యం దుకాణం తాళాలను గుర్తు తెలియని దుండగులు పగలగొట్టి కౌంటర్‌లో ఉంచిన నగదు కాజేశారు. ఈ సంఘటన నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. ఉప్పుగుండూరు గ్రామంలోని వైన్ షాపు నంబర్ 30లో శనివారం రాత్రి వ్యాపారం తాలూకా నగదు రూ.1.75 లక్షలను కౌంటర్‌లో ఉంచి మూసివేశారు. ఈ దుకాణానికి వాచ్‌మన్‌ను నియమించినప్పటికీ శనివారం అతను విధుల్లో లేడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అర్ధరాత్రి తర్వాత దుకాణం తాళాలు పగలగొట్టి నగదు కాజేశారు. ఆదివారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో కలిసి ఎస్సై మహేంద్ర నాయక్ పరిశీలించారు. దుకాణంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరించారు. చోరీ కేసు త్వరలోనే చేధిస్తామని ఎస్సై చెప్పారు.


