అంగన్‌వాడీలను చిన్నచూపు చూస్తున్నారు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీలను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రతిసారి ఎమ్మెల్యేల వేతనాలు, అలవెన్సులు పెంచుకుంటున్న పాలకులకు చిరుద్యోగులైన అంగన్‌వాడీల వేతనాలు పెంచడానికి మనసొప్పడం లేదని, ఇది అత్యంత బాధాకరమని అన్నారు. అంగన్‌వాడీల సమస్యలపై ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించి దగా చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, ప్రీ స్కూళ్లను బలోపేతం చేయాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. కందుకూరు, ఉలవపాడు ప్రాజెక్టుల అధ్యక్షులు కె.రాజేశ్వరి, చిడితోటి ఇంద్రావతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలను చిన్నచూపు చూస్తోందని, అమ్మ ఒడి నుంచే బాలబాలికల ఆలనాపాలనా చూస్తున్న అంగన్‌వాడీలను నిర్లక్ష్యం చేయడం క్షమార్హం కాదని అన్నారు. చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్‌వాడీల సేవలను విస్మరించడానికి వీలులేదని చెప్పారు. తల్లి తరువాత తల్లిలా పిల్లలకు బడి ఈడు వచ్చేంత వరకు నడక, నడత నేర్పిస్తున్న అంగన్‌వాడీల సమస్యలను పాలకులు నిర్లక్ష్యం చేయడం అంటే భావిభారతాన్ని నిర్లక్ష్యం చేయడమేనని స్పష్టం చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం మార్చి 2వ తేదీ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీలు పాల్గొని సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీ టీచర్లకు రూ.24,800, ఆయాలకు రూ.20300 వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా నాయకురాలు నెరుసుల మాలతి మాట్లాడుతూ అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా అమానవీయంగా ఉందన్నారు. సుదీర్ఘకాలం సేవలు చేయించుకుని ఒక్క రుపాయి కూడా ఇవ్వకుండా రిటైర్డ్‌మెంట్ తర్వాత ఇంటికి పంపించడం దుర్మార్గమన్నారు. మెడికల్ అలవెన్సులు, టీఏ బిల్లులను సకాలంలో ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నిరాహార దీక్షలలో అంగన్‌వాడీ యూనియన్ నాయకురాలు ఎస్.గీతా, సీఐటీయూ జిల్లా నాయకుడు గంటెనపల్లి వెంకటేశ్వర్లు, బి.నిర్మల, వై.కృష్ణవేణి, పి.క్రాంతి, జ్యోతి, లక్ష్మమ్మ, ఉమామహేశ్వరి, కత్తి బుజ్జమ్మ, మార్తమ్మ, సుగుణ, తిరుపతమ్మ, రమాదేవి, సుష్మిత, భూలక్ష్మి, అమరా గీత, అనూష శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు ధ్వజం
మూడో రోజు కొనసాగిన
అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షలు


