కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయ్‌! | - | Sakshi
Sakshi News home page

కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయ్‌!

Feb 13 2026 5:26 AM | Updated on Feb 13 2026 5:26 AM

కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయ్‌!

కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయ్‌!

అద్దంకి:

మూడు మాసాల తర్వాత పెళ్లి బాజాల మోత మోగనుంది. శుక్ర మూఢమి శుక్రవారంతో ముగియనుండడంతో జిల్లాలోనూ సుముహూర్తాల సందడి మొదలుకానుంది. గత ఏడాది నవంబర్‌ 26 నుంచి ఈ నెల 13 వరకు శుక్ర మూఢమి కారణంగా సుముహూర్తాలకు బ్రేక్‌ పడింది. మాఘమాసం శుభప్రదమైన మాసమైనప్పటికీ మూఘమితో ముహూర్తాలు లేకుండా పోయాయి. ఈ నెల 19 నుంచి సుముహూర్తాలు ఉన్నట్లు పండితులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు చేసుకున్న వారు వివాహాది, గృహప్రవేశ, గృహారంభాలకు సిద్ధమవుతున్నారు. మూడు నెలల తర్వాత జిల్లాలో పురోహితులు, భజంత్రీ కళాకారులు, కల్యాణ మండపాల నిర్వాహకులు, పూల వ్యాపారులు, వస్త్ర దుకాణాలు, అర్కెస్ట్రాలు, ట్రావెల్‌ ఏజెన్సీలు, కేటరింగ్‌ సంస్థలు, విద్యుత్‌, మైక్‌ సెట్టింగ్‌ నిర్వాహకులు తదితర 25 రంగాల వారికి మెండుగా ఉపాధి కలగనుంది.

కల్యాణ మండపాలకు గిరాకీ

మూడు నెలల తర్వాత మరో మూడు నెలలపాటు మెండుగా ముహుర్తాలు ఉండటంతో కల్యాణ మండపాల బుకింగ్‌లు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కొండపి, సంతనూతలపాడు, దర్శి, పొదిలి పట్టణాల్లో ఉన్న సుమారు 200కు పైగా ఉన్న కల్యాణ మండపాల్లో ఇప్పటికే కొన్ని డేట్లు బుక్‌ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

సుముహూర్తాలు ఇవే..

ఈ ఏడాది ఫిబ్రవరితోపాటు, మార్చి, ఏప్రిల్‌ మే, జూన్‌, ఆగస్టు, నవంబర్‌, డిసెంబరు నెలల్లో ఎక్కువగా ముహుర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఫిబ్రవరి నెలలో 19, 20, 21, 24, 25, 26, మార్చిలో 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 20, 21, 25, 29, ఏప్రిల్‌ నెలలో 1 నుంచి 8వ తేదీ వరకు, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30వ తేదీల్లో దాదాపు ఎక్కువ మందికి సూటయ్యే ముహుర్తాలు ఉన్నట్లు పురోహితులు పేర్కొంటున్నారు.

నేటితో ముగియనున్న

శుక్ర మూఢమి

19 తర్వాత సుముహూర్తాలతో

మోగనున్న బాజాభజంత్రీలు

ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో

మెండుగా ముహూర్తాలు

3 నెలలుగా వేచి ఉన్న వివిధ రంగాల వారికి మళ్లీ ఉపాధి

బుకింగ్‌లు మొదలయ్యాయి

ఈనెల 18న చాలా పెళ్లిళ్లు ఉన్నాయి. తరువాత మూడు నెలల్లోనూ వివాహాలు పెట్టుకున్న వారు ముందుగానే కల్యాణ మండపాలను బుక్‌ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే అని పురోహితులు చెబుతున్నారు.

– సుబ్బారావు, కళ్యాణ మండపం

నిర్వాహకుడు

మంచి ముహుర్తాలు ఉన్నాయి

మూడు నెలలపాటు మూఢం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే, ఆ తరువాత కూడా సుముహూర్తాలు ఉన్నాయి. ఎక్కువ మందికి సూటయ్యే ముహూర్తాలు అధికంగా ఉండటం ఈ ఏడాది విశేషం.

– గణేశ్‌, పురోహితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement