కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేస్తాం
● పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: కొండపి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా స్మార్ట్ కార్డు, ఇన్సూరెన్స్ సౌకర్యం వంటి బృహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం కొండపి మండల స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మనది కేడర్ బేస్డ్ పార్టీ అని, లీడర్ బేస్డ్ పార్టీ కాదని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో సుమారు వెయ్యి మంది సమర్థులైన నాయకులను పార్టీ పదవుల్లో నియమిస్తామన్నారు. మనమంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రూపు అని, ఆ ప్రకారమే ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, అంతేగానీ కోవర్టు రాజకీయాలు చేయవద్దని కోరారు. గతంలో బల్బు ఇక్కడ ఉండేదని, స్విచ్ మాత్రం ఎక్కడో ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సాక్షాత్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి కొండపి సమావేశంలో ప్రకటించిన విషయాన్ని ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు.
దమ్మున్న నాయకుడు జగనన్న...
మన నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆదిమూలపు సురేష్ గర్వంగా చెప్పారు. కానీ, పక్క పార్టీల నాయకులలో ఒకరు శ్రీమా నాయన దేవుడి హారతితో సిగరెట్ వెలిగించేవాడని ఒకసారి, మా ఇంట్లో అంతా రామనామమే జపిస్తారని మరోసారి, నా భార్య బాప్టిస్టు అని ఇంకోసారి చెప్పి చివరకు సనాతన ధర్మమని అంటాడంటూ ఎద్దేవా చేశారు. సనాతన ధర్మమంటే ఏకపత్నివ్రతుడని, కానీ ఆ నాయకుడు ఉదయం ఒకమాట, సాయంత్రం ఒకమాట, తెల్లారి మరోమాట చెబుతాడని, జగనన్న అలాంటి వ్యక్తి కాదని అన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి పొత్తులు లేకుండా ఒంటరిగానే జగనన్న పోటీ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందని, కొండపి నియోజకవర్గంలో తమ పార్టీ ఓడిపోలేదని, 92 వేల ఓట్లు రాగా 43 శాతం ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఆ శాతాన్ని పెంచేందుకు మాత్రమే కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం...
రాబోయే రోజుల్లో పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచి పార్టీని బలోపేతం చేసే విధంగా జగనన్న బస్సుయాత్ర, పాదయాత్ర, నియోజకవర్గ యాత్రలు చేస్తారని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 2029లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ యాత్రలు చేస్తారని వివరించారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు తాను పూర్తి అండగా ఉంటానని, గోడమీద పిల్లులుగా ఉండే నాయకులను దూరంగా పెడతానని స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ అవసరమని, కలుపు మొక్కలను ఏరివేస్తానని హెచ్చరించారు.
నియోజకవర్గంలో రెడ్‌బుక్ పాలన...
కొండపి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన సాగిస్తోందని ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ఆస్తులు, పొలాలు బలవంతంగా లాక్కున్నారని, చివరికి గంజాయి కేసులు పెడతామని కూడా పోలీసులు బెదిరించారని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేసిన రెవెన్యూ, పోలీసు యంత్రాంగం, టీడీపీ నాయకులకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు...
నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారిలో మారిటైం బోర్డు చైర్మన్ ఒకరని, ఇతను ముఖ్యమంత్రికి తక్కువ మంత్రికి ఎక్కువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సురేష్ విమర్శించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పోలీసులు తమ పార్టీ కార్యక్రమాలకు అడ్డంకుల సృష్టించటంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాను జాగ్రత్తగా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నానని తెలిపారు. అవసరమొచ్చినప్పుడు సై అంటే సై అంటానని స్పష్టం చేశారు. కొండపిలో విజయం సాధిస్తే రాష్ట్రంలో 175 సీట్లు సాధించినట్లేనని, అందువలన నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, మండల పరిశీలకుడు పల్నాటి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొండపిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేస్తాం


