పాకలలో కరెంటు కట్..!
విద్యుత్ సమస్యపై అధికారులను నిలదీసిన ప్రజలు బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించి వెళ్తున్న అధికారుల కార్లను అడ్డుకున్న స్థానికులు
సింగరాయకొండ: మండలంలోని పాకలలో ఈ నెల 14, 15 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఒకవైపు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు పాకల ప్రజలు తీవ్రస్థాయిలో విద్యుత్ సమస్య ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా విద్యుత్ సమస్యతో స్థానికులు అల్లాడుతున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండటంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం విద్యుత్ అంతరాయంపై ముందస్తు సమాచారం కూడా ఇవ్వకపోతుండటంతో గురువారం రోడ్డెక్కారు. రోజూలానే రాత్రి సుమారు 9 గంటల సమయంలో విద్యుత్ సరఫరా చేయగా, స్థానిక ఆది ఆంధ్ర కాలనీలోని ట్రాన్స్‌ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ సమయంలో కాలనీలో రెండు వివాహాలు జరుగుతున్నాయి. దీంతో కాలనీవాసులు ఆగ్రహించి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను పరిశీలించి తిరిగి వెళ్తున్న జేసీ కల్పనాకుమారి కారు ఆపి సమస్య వివరించారు. స్పందించిన జేసీ.. సమస్య పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లుతో కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నోనెలలుగా కాలనీలో లో ఓల్టేజీ సమస్య ఉందని, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా కరెంటు సమస్య ఎదుర్కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం కరెంటు తీసివేసి రాత్రి ఇచ్చిన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఎస్‌ఈ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఈలోగా ఎస్సై బీ మహేంద్ర సంఘటన స్థలానికి చేరుకుని అధికారుల కార్లను కాలనీవాసులు అడ్డుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


