మహిళా చట్టాల అమలు పుస్తకం ఆవిష్కరణ
ఒంగోలు టౌన్: మహిళల రక్షణ కోసం రూపొందించిన చట్టాల అమలులో పోలీసు, న్యాయ వ్యవస్థ వైఫల్యాలను ఆధారాలతో నిరూపిస్తూ మహిళా పోరాట యోధుల అనుభవాలతో రచించిన మహిళా చట్టాల అమలు అనుభవాలు పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.పద్మ అన్నారు. స్థానిక మాదాల నారాయణ స్వామి భవనంలో మహిళా చట్టాల అమలు అనుభవాలు, న్యాయం కోసం మహిళల సుదీర్ఘ ప్రయాణం పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, పనిస్థలంలో అసమానతలు, కుల వర్గ అధారిత వివక్ష వంటి అనేక సమస్యలపై ఈ పుస్తకంలో ప్రత్యేక్ష అనుభవాలను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ పుస్తకం మహిళలను కేవలం బాధితులుగా కాకుండా పోరాట యోధులుగా చిత్రీకరిస్తుందన్నారు. చట్టాలు ఉన్నా న్యాయం కోసం మహిళలు ఎంతటి సుదీర్ఘ పోరాటం చేయాల్సి వస్తుందో స్పష్టంగా వివరించినట్లు తెలిపారు. మహిళా ఉద్యమాలు, సంఘటిత పోరాటాల అవసరాన్ని ఈ పుస్తకం నొక్కి చెబుతుందన్నారు. ఈ నెల 12వ తేదిన జరిగే సార్వత్రిక సమ్మెలో మహిళలంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వి.మంజుల, శాఖమూరి భారతి, సీహెచ్ పద్మ, వై.సుశీల, యరమాల కోటేశ్వరమ్మ, వి.సుజాత అమ్మాజీ, కుమారి పాల్గొన్నారు.


