అడ్డగోలు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలు దోపిడీ

Feb 11 2026 7:17 AM | Updated on Feb 11 2026 7:17 AM

అడ్డగోలు దోపిడీ

అడ్డగోలు దోపిడీ

నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌పై వర్కులు రూ.75 లక్షల వర్కు నామినేషన్‌ కింద ఇవ్వడంపై అభ్యంతరాలు ట్రేడ్‌ లైసెన్సుల బకాయిల పేరుతో రూ.77 లక్షలకు మంగళం వైఎస్సార్‌ సీపీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ధ్వజం ఒంగోలు కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం నామమాత్రపు చర్చతో 130 అంశాలు2 గంటల్లో ముగింపు

ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు నగర పాలక సంస్థలో అడ్డగోలుగా దోచుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్‌పై లక్షలాది రూపాయల వర్కులు కేటాయించారని వైఎస్సార్‌సీపీ సభ్యులు ధ్వజమెత్తారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల లోపు వర్కులను మాత్రమే నామినేషన్‌ పద్ధతిపై కేటాయించాల్సి ఉంటే అంతకు మించి వర్కులను నామినేషన్‌పై ఇవ్వటం అత్యంత దారుణమని కౌన్సిల్‌లో వైఎస్సార్‌ సీపీ సభ్యులు నిలదీశారు. మేయర్‌ జీ.సుజాత అధ్యక్షతన మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్‌ హాలులో కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం నిర్వహించారు. 130 అంశాలతో కూడిన అజెండాను నామమాత్రపు చర్చతో మ..మ అనిపించారు. అయితే ప్రజా సమస్యలను చర్చించకుండా అధికార టీడీపీ సభ్యులు ఆమోదం తెలపటంతో వైఎస్సార్‌ సీపీ కౌన్సిల్‌ ఫ్లోర్‌ లీడర్‌ పఠాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా ఒంగోలు నగరంలో డివైడర్లకు పెయింట్లు వేయటంతో పాటు ఇంటి నంబర్ల వేయటంలో నగర పాలక సంస్థ అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలారంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ ధ్వజమెత్తారు. ఇంటి గోడలకు రంగు పూసి, నంబర్లు వేయటానికి ఏకంగా నామినేషన్‌ పద్ధతిపై రూ.75 లక్షలకు కాంట్రాక్టు ఇవ్వటమేమిటని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రూ.5 లక్షల లోపు వర్కుకు మాత్రమే నామినేషన్‌ పద్ధతిపై కేటాయిస్తారని, రూ.లక్షలోపు అయితే బాక్స్‌ పద్ధతిపై వర్కు ఇస్తారన్నారు. అలాంటిది రూ.75 లక్షల వర్కు నామినేషన్‌ పద్ధతిపై ఇవ్వటం వెనుక దాగిఉన్న మతలబు ఏమిటన్నది స్పష్టం చేయాలని అధికారులను నిలదీశారు. అదేవిధంగా ట్రంకు రోడ్డు విస్తరణ విషయంలో అధికారుల తీరు ప్రశ్నార్థకంగా ఉందని కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు. ట్రంకు రోడ్డు బాధితులకు టీడీఆర్‌ బాండ్లు ఇస్తామనటం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ప్రస్తావించారు. ఇదే అంశాన్ని అధికార జనసేన సభ్యుడు, డిప్యూటీ మేయర్‌ వెలనాటి మాధవరావు కూడా ట్రంకు రోడ్డు బాధితుల విషయంలో అన్యాయం చేయకూడదని కౌన్సిల్‌ దృష్టికి తీసుకొచ్చారు.

రాజకీయ పార్టీల వారీగా మంచినీళ్లు ఇస్తున్నారు...

ఒంగోలు నగరంలో అగ్రహారం రైల్వే గేటు అవతల ప్రజలకు రాజకీయ పార్టీల వారీగా చూసిమరీ మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయటం దారుణమని వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ పఠాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ధ్వజమెత్తారు. అగ్రహారం రైల్వే గేటు అండర్‌ పాస్‌ పనులు జరుగుతున్నాయని, మంచినీటి పైపులైను తీసేయటంతో 16వ డివిజన్‌ ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నారని, అయితే అధికార పార్టీకి చెందిన ప్రజలకు ఒకరకంగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజలకు మరోరకంగా, అధికార పార్టీలోనే కూటమి పార్టీలోని మరో పార్టీ ప్రజలకు ఇంకో రకంగా మంచినీరు సరఫరా చేయటం దారుణమన్నారు. ఇంటికి ఒక డ్రమ్ము కూడా ఇవ్వటం లేదని, ప్రజలు సొంత డబ్బులు వెచ్చించి మరీ మంచినీళ్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు తేజతో పాటు ఏ.శ్రీనివాస్‌లు వైఎస్సార్‌ సీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాట్లాడుతుంటే అడుగడుగునా అడ్డుకున్నారు. నగరంలోని వ్యాపారుల వద్ద వసూలు చేయాల్సిన ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయకుండా బకాయిల పేరుతో నగర పాలక సంస్థ ఆదాయానికి మంగళం పాడుతున్నారని జనసేన సభ్యుడు ఈదర సురేష్‌ బాబు కౌన్సిల్‌లో ప్రస్తావించారు. మొత్తం నగరంలో 791 మంది నుంచి వసూలు చేయాల్సిన రూ.77 లక్షలను ఏ విధంగా రద్దు చేస్తారంటూ మండిపడ్డారు. ఆ అంశంలో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌ లీడర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా ఈదర సురేష్‌కు మద్దతుగా మాట్లాడారు. బకాయిలు రద్దు చేసిన వాళ్లలో బడా బాబులు, పెట్రోలు బంకులు, ఇంకా రూ.కోట్లలో వ్యాపారం జరిగే వాళ్లు కూడా ఉన్నారన్నారు. నగరంలోని డివైడర్ల మధ్యలో ఎల్‌ఈడీ అడ్వర్‌టైజ్‌మెంట్‌ బోర్డులు విద్యుత్‌ స్తంభాలకు బిగిస్తున్న అంశంపై జనసేన, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జనసేన సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, కమిషనర్‌ కే.వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణతో పాటు వివిధ విభాగాల అధికారులు పాలొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement