జాబ్ క్యాలండర్ ప్రకటించాలి
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలన్నీ ప్రకటించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలండర్ ప్రకటిస్తామన్న మాటను కనీసం ఈ ఏడాదైనా చంద్రబాబు ప్రభుత్వం నిలుపుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో సోమవారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఒంగోలులో వాన్‌పిక్, కనిగిరి నిమ్జ్, చీమకుర్తి శిల్పారామం, దొనకొండ పారిశ్రామిక కారిడార్, తదితర పరిశ్రమలు పూర్తి చేయాలన్నారు. నిర్మాణం ఆగిపోయిన దర్శి డ్రైవింగ్ స్కూల్‌ను పూర్తి చేయాలన్నారు. ఇటీవల కనిగిరిలో శంకుస్థాపన చేసిన గ్యాస్ కంపెనీని వెంటనే పూర్తి చేసి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ భృతిగా నెలకు 3 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, ఈ బడ్జెట్ వలన నష్టం తప్ప లాభం లేదని వ్యాఖ్యానించారు. బడ్జెట్లో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను అడిగే దమ్ము చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కార్.. 12 ఏళ్లు గడుస్తున్నా ఆతీగతీ లేదని మండిపడ్డారు. ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, రైల్వే సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ దేశం అభివృద్ధిలో నడుస్తోందని మోదీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో యువజన నాయకులు దానియేలు, టి.భాను, నవీన్, రాజు పాల్గొన్నారు.


