ఆటపాటలతో అలరించిన బాలోత్సవం
ఒంగోలు టౌన్: నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో రెండో రోజు ఆదివారం బాలోత్సవం చిన్నారుల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా నలుమూలల నుంచి సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పండుగకు తరలివచ్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో అంశంలో తన సత్తా చాటారు. ఏకపాత్రాభినయనంలో అద్భుతంగా నటించారు. సంప్రదాయ కోలాటంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. జానపద నృత్యాలతో అదరగొట్టారు. సీ్త్ర విద్య కోసం అవిరళ కృషి చేసిన సావిత్రిబాయి, పూలే, ఫాతిమా షేక్ వంటి మహనీయులను ఉద్దేశించి ‘మరవ వద్దురా సమాజమా మహనీయులను’ అంటూ ప్రదర్శించిన నృత్యం ఆహుతులను ఆలోచింపజేసింది. మట్టితో చేసిన బొమ్మలను చూడడానికి ఆసక్తి కనబరిచారు. సమాజంలో మూఢ విశ్వాసాల వలన జరుగుతున్న నష్టాలు, కష్టాల గురించి వివరిస్తూ మెడలో పుర్రె బొమ్మలతో తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్ధిని ఐ.భాగ్యశ్రీ చేసిన ప్రదర్శనకు ప్రశంసలు దక్కాయి. నూతన ఆవిష్కరణలతో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన అబ్బురపరిచింది. ఏక కాలంలో 8 వేదికలపై జరిగిన పలు ప్రదర్శనలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 200 మంది ఎన్‌సీసీ వాలంటీర్లు, వంద మంది ఉపాధ్యాయులు సేవలందించారు.
బాలల ఉజ్వల భవితకు బాలోత్సవం బాటలు...
బాలల ఉజ్వల భవితకు బాలోత్సవం బంగారు బాటలు వేస్తుందని వక్తలు చెప్పారు. మొబైల్ ఫోన్ల మాయలోపడి కొట్టుకుపోతున్న విద్యార్థులకు చక్కటి దిశానిర్దేశం చేసే బాలోత్సవం జిల్లాలోని అన్నీ ప్రాంతాలలో నిర్వహించాల్సిన అవసరముందని అతిథులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వేలాది మంది విద్యార్థులను ఒక వేదిక మీదకు చేర్చిన నిర్వాహకుల కృషిని అభినందించారు. టంగుటూరు మండల విద్యాశాఖాధికారి టి.బాలాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, మేయర్ గంగాడ సుజాత, బాలోత్సవ కమిటీ గౌరవాధ్యక్షుడు ఏవీ రమణా రెడ్డి, కమిటీ ప్రతినిధులు బండారు లక్ష్మి నారాయణ, డి.వీరాజంనేయులు, రవి, అబ్దుల్ హై, జ్యోతి, జయప్రకాష్, షేక్ ఖాజా హుసేన్, ఉమా మహేశ్వరి, భాస్కర్, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.
4 వేల మందికి పైగా విద్యార్థుల సందడి
కోలాటం, జానపద నృత్యాలు, సైన్స్ ప్రదర్శనల, మట్టిబొమ్మలతో ఔరా అనిపించిన చిన్నారులు
ఆటపాటలతో అలరించిన బాలోత్సవం
ఆటపాటలతో అలరించిన బాలోత్సవం


