ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
మార్కాపురం రూరల్: ఈతకు వెళ్లి నీటిలో మునిగి 9వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని రాయవరం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పూలసుబ్బయ్య కాలనీకి చెందిన ఏసుబాబు (15) ఆదివారం సెలవు రోజు కావడంతో తన స్నేహితులైన బత్తుల జాన్ వెస్లీ, బూతపాటి అభిరామ్‌లతో కలిసి రాయవరం సమీపంలో హైవేరోడ్డు పక్కన ఉన్న పలకల క్వారీ వద్దకు వెళ్లారు. అక్కడ ఈతకొట్టేందుకు గుంతలో దిగగా..నీళ్లు ఎక్కువ లోతు ఉండటంతో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా తల్లిదండ్రుల రోదనలతో మిన్నంటింది. మార్కాపురం సీఐ సుబ్బారావు, రూరల్ ఎస్సై వేమన ఈతగాళ్లతో గుంతలో గాలించారు. రాత్రి 8 గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తల్లిదండ్రులు ప్రభాకర్, అల్లూరమ్మలు బేల్దారి పనులు చేసుకుంటూ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటూ కుమారుడిని చదివించుకుంటున్నారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి


