కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు
● వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్
జరుగుమల్లి (సింగరాయకొండ): వైఎస్సార్ సీపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తమది క్యాడర్ బేస్డ్ పార్టీగానీ.. లీడర్ బేస్డ్ పార్టీ కాదని ఆ పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. జరుగుమల్లి మండలంలోని వావిలేటిపాడు గ్రామంలో శనివారం పార్టీ మండల స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ పదవుల్లో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 8 వేల మందికి పదవులిచ్చి బలమైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్, రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేమైనా రాజరికం, జమీందారీ వ్యవస్థా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ, ప్రజలందరికీ రాజ్యాంగం హక్కులు కల్పించిందని గుర్తు చేశారు. జగనన్న హయాంలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేశారని, ఏ ప్రభుత్వమైనా అదే విధానాన్ని పాటించాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.
కొండపి నియోజకవర్గంలో పార్టీ
ఓడిపోలేదు...
కొండపి నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం గెలిచింది తప్ప వైఎస్సార్ సీపీ ఓడిపోలేదని ఆదిమూలపు సురేష్ అన్నారు. పార్టీకి 32 వేల ఓట్లు వచ్చాయని, 44 శాతం ఓటు బ్యాంకు ఉందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు ఉంటారేగానీ శత్రువులు ఉండరన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి దమ్మున్న నాయకుడని, తమ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌లను పరామర్శించడానికి తన ఇంటి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి జగన్‌మోహన్‌రెడ్డికి సుమారు 8 గంటలు పట్టిందని, ఇది ప్రజలకు జగన్‌పై ఉన్న అభిమానమని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా జైలులో పెడుతున్నారని, ఇళ్లపై పెట్రోలు బాంబులు వేస్తున్నారని, పొలాలు ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఫ్లెక్సీలు వేయకూడదని.. చివరకు గణేష్ నిమజ్జనం రోజున కూడా డీజేలు పెట్టకూడదని ఆంక్షలు విధించారని మండిపడ్డారు. చివరకు రోడ్డుపైనే గణేష్ విగ్రహం వదిలి వెళ్లే పరిస్థితి కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పదవులు పొందిన ప్రతిఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని, రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తామని వివరించారు. పార్టీ పేరు చెప్పుకుని ఎదిగినవారు పార్టీని మర్చిపోకూడదని, పార్టీ విధేయులుగా ఉండాలే తప్ప వెన్నుపోటు పొడవకూడదని కోరారు.
పొగాకుకు
గిట్టుబాటు ధర కల్పించాలి...
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జగనన్న మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పొగాకు ధరలు ఏ విధంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రైతు కంటతడిపెట్టినా, కుదేలైనా ఆ ప్రభుత్వాలు మనుగడ సాగించవని హెచ్చరించారు. జగనన్నది సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పదవులు ఇస్తామని, నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సురేష్‌ను పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసరావు, బత్తిన మదన మనోహరరావు, కనపర్తి శేషారెడ్డి, కొమ్మాలపాటి మధుసూదనరావు, దగ్గుమాటి బూసిరెడ్డి, హనుమారెడ్డి, పాడిబండ్ల వేణు, కసుకుర్తి పున్నారావు, నాగినేని భాస్కర్, పాలేటి రవి, ఉప్పాళ్ల శ్రీనివాసులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు


