మాలకొండ ఆదాయం రూ.7,96,793
వలేటివారిపాలెం: మండలంలోని మాలకొండలో ఉన్న మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ.7,96,793 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ఎస్.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. కుంకుమార్చన ద్వారా రూ.20,680, తలనీలాల ద్వారా రూ.27,325, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.2,36,800, రూమ్ అద్దెలకు రూ.25,860, లడ్డు ప్రసాదాలకు రూ.2,08,380, అన్నదానానికి విరాళంగా రూ.2,48,057, ఇతర విరాళాలు కలిపి మొత్తం రూ.7,96,793 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు.
● రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం
టంగుటూరు: ప్రమాదవశాత్తూ పొగాకు బ్యారన్ దగ్ధమైన సంఘటన మండలంలోని ఎం.నిడమానూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఎం.నిడమానూరు గ్రామానికి చెందిన అన్నాబత్తిన బాలాజీరావు బ్యారన్‌లో పొగాకు రెలిపి క్యూరింగ్ కోసం దాదాపు 1200 కర్రలు పెట్టారు. అయితే రైజ్ చూసే సమయంలో కర్ర మొద్దు గొట్టాంపై జారిపడి మంటలు వ్యాపించాయి. బ్యారన్‌లో ఉన్న కర్ర, ఆకు, టైర్లు అగ్నికి ఆహుతై సుమారు రూ.4 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.
మంగపతివారిపాలెంలో...
పొన్నలూరు: మండలంలోని మంగపతివారిపాలెం గ్రామంలో మన్నెం స్రవంతికి చెందిన పొగాకు బ్యారన్ శనివారం ప్రమాదవశాత్తూ దగ్ధమైంది. క్యూరింగ్ జరుగుతుండగా పొగాకు అల్లిక కర్రలు జారి మొద్దుగొట్టంపై పడి అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో సుమారు 1200 పొగాకు కర్రలు, బ్యారన్ లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. దీంతో దాదాపు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు. విషయం తెలుసుకున్న కందుకూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
గిద్దలూరు రూరల్: పట్టణంలోని రాజానగర్ ముందు భాగంలో శనివారం ఓ యువకుడు మద్యం మత్తు నెత్తికెక్కి తన గమ్యస్థానానికి వెళ్లలేక రోడ్డు పక్కనే ఉన్న మురికి కాలువ వద్ద పడిపోయాడు. ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం విక్రయాలు చేస్తుండటంతో యువకులు మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.
మేదరమెట్ల: ఒంగోలు వైపు నుంచి మాచర్ల వైపునకు వెళ్తున్న లారీ ఢీకొని మహిళలకు గాయాలైన సంఘటన శనివారం రాత్రి జాతీయ రహదారిపై జరిగింది. కొరిశపాడు మండలం తిమ్మనపాలెం వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న మహిళను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆత్మకూరు అంజమ్మ కాలికి తీవ్ర గాయమవగా హైవే అంబులెన్స్‌లో ఒంగోలు జీజీహెచ్‌కి తరలించినట్లు కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల పోలీసులు తెలిపారు.
అద్దంకి రూరల్: అద్దంకిలోని చర్చిపై దుండగులు బుధవారం దాడి చేయగా, శనివారం వెలుగులోకి వచ్చింది. పంగులూరు మండలానికి చెందిన వ్యక్తి అద్దంకిలోని రామ్‌నగర్‌లో చర్చి ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు నిర్వహిస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ చర్చిపై దాడి చేసి లోపలున్న వస్తువులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
మాలకొండ ఆదాయం రూ.7,96,793


