విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Feb 8 2026 4:22 AM | Updated on Feb 8 2026 4:22 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి మామిడి తోట విధ్వంసం పీసీ పల్లి చోరీ కేసులో ఒకరు అరెస్ట్‌

ముండ్లమూరు: సర్వీస్‌ వైరు బిగించేందుకు స్తంభం ఎక్కి ప్రమాదశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై జారిపడి గూడాల అంజిరెడ్డి (38) మృతి చెందిన సంఘటన మండలంలోని పసుపుగల్లు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇంటికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో విద్యుత్‌ సరఫరా ఇచ్చేందుకు పాత ఊరు వీధిలో ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఎక్కి సర్వీస్‌ వైర్‌ బిగుస్తున్నారు. ఆ క్రమంలో అంజిరెడ్డికి తన చేతిలో ఉన్న కటింగు బేర్‌ లైన్‌ తగలడంతో ఒక్కసారిగా షాక్‌ గురై స్తంభం పక్కన ఉన్న గోడపై పడి తలకు తీవ్ర గాయమైంది. దీంతో సంఘటన స్థలంలోనే అంజిరెడ్డి మృతి చెందాడు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న అంజిరెడ్డిని కోల్పోయిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. విషయం తెలుసుకున్న ముండ్లమూరు ఎస్సై కమలాకర్‌ సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ ఎన్‌.వెంకటేశ్వరరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. అంజిరెడ్డి మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.

సింగరాయకొండ: హైకోర్టు పరిధిలో వివాదంలో ఉన్న మామిడి తోటను కొందరు అక్రమంగా జేసీబీలతో ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో జరిగింది. వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యన్నాబత్తిన వెంకటేశ్వరరావు (చిన్నా), మాజీ ఎంపీటీసీ షేక్‌ సలీంబాషా, కనుమళ్ల మాజీ సర్పంచ్‌ తన్నీరు రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బాలయోగినగర్‌లో సోమరాజుపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వేనెంబరు 659–3లో 2.74 ఎకరాల స్థలాన్ని కుంచాల విజయకు 1997వ సంవత్సరంలో అప్పటి మంత్రి దామచర్ల ఆంజనేయులు అసైన్‌మెంటు కమిటీ ద్వారా కేటాయించారు. ఇటీవల ఆమె తన స్థలంలో సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసి మామిడిమొక్కలు వేసుకుని భధ్రత కోసం ఫెన్సింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. కానీ, రాత్రివేళ సుమారు 30 మంది రెండు జేసీబీలు తీసుకొచ్చి ఫెన్సింగ్‌, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అంతేగాకుండా వారు వెంట తెచ్చుకున్న కత్తులతో మామిడి మొక్కలను కూడా నరికేశారు. అక్కడ కాపలా ఉన్న వాచ్‌మెన్‌ను కూడా బెదిరించారు. కోర్టులో వివాదంలో ఉన్న భూమిలో ఈ విధంగా విధ్వంసం సృష్టించటంపై వైఎస్సార్‌ నాయకులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ఎస్పీ హర్షవర్థన్‌రాజును కలిసి బాధితురాలు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

కనిగిరి రూరల్‌: పీసీ పల్లి మండలం బండపాలెం గ్రామంలో ఏనుగంటి వెంగమ్మ ఇంట్లో చోరీకి పాల్పడిన కేసులో ఒకరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. స్థానిక డీఎస్పీ సాయి ఈశ్వర్‌ యశ్వంత్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 2వ తేదీ బండపాలెంలోని ఏనుగంటి వెంగమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాలు, డీఎస్పీ సూచనలతో కనిగిరి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనుమానితుల కోసం గాలించారు. శనివారం స్థానిక బొడ్డు చావిడి సెంటర్‌లో బంగారపు వస్తువులు అమ్మడానికి వచ్చిన కాళహస్తి శివశంకర్‌ను అనుమానించి పట్టుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో అతన్ని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఒక బంగారు నల్లపూసల తాడు, రెండు బంగారపు ఉంగరాలు, ఒక బంగారు చెవి కమ్మలు, రెండు జతల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పోలీసులు చెప్పారు. అలాగే, పరారీలో ఉన్న మరో ముగ్గురిని త్వరలో పట్టుకుని మిగతా ఆభరణాలను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి 1
1/1

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement