హత్య కేసులో నిందితుడు అరెస్ట్
పొదిలి: ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళను హత్యచేసిన కేసులో నిందితుడు మెడబలిమి ఏడుకొండలను అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, పొదిలి సీఐ రాజేష్‌కుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరించారు. పొదిలి మండలంలోని గోగినేనివారిపాలెం గ్రామానికి చెందిన పులి బుల్లెమ్మ భర్త మల్లికార్జునరావు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో బుల్లెమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. అదే గ్రామానికి చెందిన మెడబలిమి ఏడుకొండలు వ్యవహారశైలి గురించి ఏడుకొండలు భార్యతో బుల్లెమ్మ చెప్పింది. పలువురు మహిళలతో నీ భర్తకు వివాహేతర సంబంధం ఉందని చెప్పడంతో ఏడుకొండలుతో అతని భార్య గొడవపడి పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. తన భార్య అలిగి వెళ్లిపోవడానికి బుల్లెమ్మ కారణమని భావించి ఆమైపె ఏడుకొండలు పగ పెంచుకున్నాడు. లైంగిక కోరికలు, పగ తీర్చుకునేందుకు గత సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ రాత్రి పూట ఒంటరిగా ఉన్న బుల్లెమ్మ ఇంటిలోకి ఏడుకొండలు వెళ్లాడు. లైంగిక కోరికలు తీర్చాలని బుల్లెమ్మపై ఒత్తిడి చేశాడు. అందుకు బుల్లెమ్మ అంగీకరించకుండా పెనుగులాడింది. దీంతో ఈ విషయం గ్రామంలోని వారికి తెలిస్తే పరువుపోతుందని, గొడవలు అవుతాయని భావించిన ఏడుకొండలు.. బుల్లెమ్మను చంపాలని నిర్ణయించుకున్నాడు. పక్కనే షోకేసులో ఉన్న ప్లాస్టిక్ తాడును బుల్లెమ్మ మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు.. పోలీసుల నుంచి ఎక్కువ రోజులు తప్పించుకుని తిరగడం కష్టమని భావించి వీఆర్‌ఓ కిలారి సుబ్బారావును సంప్రదించాడు. దీంతో ఏడుకొండలును పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నటు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ రాజేష్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ షాకీర్, కానిస్టేబుల్ కోటేశ్వరరావును జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.


