క్విస్ ఫెస్ట్ – 2026 ప్రారంభం
ఒంగోలు సిటీ: స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో క్విస్ ఫెస్ట్ – 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఏడాది స్పందన అద్భుతంగా ఉందని క్విస్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నిడమానూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డాక్టర్ నిడమానూరి గాయత్రిదేవి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1200 మంది విద్యార్థులు టెక్నికల్, స్పోర్ట్స్, పేపర్ ప్రజంటేషన్, పోస్టర్ ప్రజంటేషన్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో ఐపీఆర్ సీ యూనిట్ మాజీ డైరెక్టర్ బదరీ నారాయణమూర్తి, స్పెషల్ గెస్ట్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ కపా కిరణ్‌రెడ్డి సారెళ్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా బదరీ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ పరుగులు పెడుతోందని, దానికి తగ్గట్లుగా అందరూ అప్ డేట్ అవ్వాలని విద్యార్థులకు సూచించారు. తాము చదువుకునే రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ లేవని, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని, ప్రతిఒక్కరూ దాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. క్విస్ విద్యాసంస్థల్లో టెక్నికల్ ఎక్స్ పోని సందర్శించిన ఆయన.. విద్యార్థుల ప్రాజెక్ట్‌లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం మాట్లాడిన బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ మేనేజర్ కపా కిరణ్ రెడ్డి సారెళ్ల ప్రకాశం జిల్లా నుంచి ఎంతోమంది అద్భుతమైన విద్యావంతులు వచ్చారని అన్నారు. నిడమానూరి గాయత్రిదేవి మాట్లాడుతూ క్విస్ కాలేజీ వరుసగా మూడో ఏడాది క్విస్ ఫెస్ట్ నిర్వహిస్తోందని తెలిపారు. సాయంత్రం జరిగిన డీజే నైట్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో క్విస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.హనుమంతరావు, ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కిశోర్‌బాబు, డీపీఎస్ ఆర్ డైరెక్టర్ డాక్టర్ బి.వి.సుబ్బారావు పాల్గొనగా, డాక్టర్ సమీర్ కుమార్ కన్వీనర్‌గా, డాక్టర్ లక్ష్మీవరప్రసాద్, డాక్టర్ అరుణ్ నంబి కో – కన్వీనర్లుగా వ్యవహరించారు.


