జీజీహెచ్‌లో వైద్యసిబ్బందిని నియమించకుంటే చూస్తూ ఊరుకోం
మార్కాపురం జీజీహెచ్‌లో పూర్తిస్థాయిలో వైద్యసిబ్బందిని నియమించకపోతే చూస్తూ ఊరుకోమని వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మార్కాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జీజీహెచ్‌ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి దాదాపు 75 మంది వైద్యులు, స్పెషలిస్టులను నియమించి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జీజీహెచ్‌ను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత సుమారు 60 మందికిపైగా వైద్యులను బదిలీ చేయడంతోపాటు 53 మంది నర్సింగ్ స్టాఫ్‌ను కూడా పిడుగురాళ్లకు బదిలీ చేయడం దుర్మార్గమని అన్నారు. జిల్లా ఇచ్చిన ఆనందాన్ని చంద్రబాబు నాయుడు తీసేశారని, ప్రస్తుతం జీజీహెచ్ పూర్తిగా ఖాళీ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఉన్న వైద్యశాలల్లో డాక్టర్లు, స్పెషలిస్టు వైద్యులు లేకపోతే రోగులకు ఎలా సేవలందుతాయని ఆయన ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని నియమించి మంచి సేవలు అందించాలని జంకె డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం ఎక్కువగా ఉందని, గిరిజనులు, పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వైద్య సేవల కోసం జీజీహెచ్‌కి వస్తుంటారని తెలిపారు. ప్రస్తుతం జీజీహెచ్‌లో వైద్యులు లేకపోవడంతో ఓపీ కూడా తగ్గిపోయిందని తెలిపారు. ఇప్పటికై నా వైద్యారోగ్యశాఖ అఽధికారులు దృష్టిపెట్టి డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని జంకె కోరారు.
వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంటు
పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి


