కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం | - | Sakshi
Sakshi News home page

కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం

Feb 3 2026 7:13 AM | Updated on Feb 4 2026 7:01 AM

కష్టప

కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి

కొండపి: వైఎస్సార్‌ సీపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి భరోసా ఇచ్చారు. కొండపి మండల కేంద్రంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గస్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశంలో బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో గతంలో ఇన్‌చార్జిలుగా పనిచేసిన వారికి అప్పటి నాయకులు పూర్తి బాధ్యతలు ఇవ్వలేదని, స్విచ్‌ ఒక చోట ఉంటే.. బల్బు ఇంకోచోట ఉందని, కానీ, ప్రస్తుతం కొండపిలో ఆ దరిద్రం పోయిందని స్విచ్‌, బల్బు రెండూ ప్రస్తుత ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్‌ చేతుల్లోనే ఉన్నాయని తెలిపారు. తాను నియోజకవర్గ రాజకీయాల్లో ఎటువంటి జోక్యం చేసుకోనని తెలిపారు. రాబోయే ఎన్నికలలో సురేష్‌ పోటీ చేస్తాడని, ఇంకెవరూ ఇక్కడికి రారని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ కేడర్‌ ఎలా పోరాడిందో తెలియదని, కానీ, ఈసారి ఎన్నికల్లో పార్టీ కేడర్‌ కష్టపడి పనిచేయాలని, ఇందుకోసం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో సుమారు 8 వేల మందికి పదవులిచ్చి బలమైన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

పార్టీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పొన్నలూరు మండలం నుంచి మండల, గ్రామస్థాయి సమావేశాలను ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పార్టీకి ఓటర్ల సంఖ్య బాగానే ఉందని, 2014లో 84 వేలు, 2019లో 90 వేలు, 2024లో 92 వేల ఓట్లు పడ్డాయని తెలిపారు. ఓటర్లను మరింత ప్రభావితం చేసుకుని రాబోయే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం చంద్రబాబు పాలన సాగడం లేదని, వారి ఆదేశాలతో పోలీసు పాలన జరుగుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు ఫ్లెక్సీలు వేసినా, మీటింగులు పెట్టినా, మైకులు పెట్టుకున్నా పోలీసుల ఆంక్షలు ఎక్కువయ్యాయని విమర్శించారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో అనేక కేసులు పెట్టారని, అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో ఎవరైనా ఆ పార్టీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరితే సాయంత్రానికి వారిని లాక్కెళ్లి మళ్లీ తమ పార్టీల కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. గణేష్‌ నిమజ్జనం సమయంలో పొన్నలూరు మండలం చవటపాలెంలో వినాయక విగ్రహాన్ని రోడ్డుపైనే వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, పోలీసుల ఆటవిక పాలనను ఎదురొడ్డి పోరాడుతున్నామని అన్నారు. గతంలో ఎప్పుడూ ప్రతిపక్షాలను ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదన్నారు. తిరుపతి లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరేందుకు ఆలయానికి వెళ్లి పూజలు జరిపితే.. విలేకరుల సమావేశం పెట్టవద్దంటూ పోలీసులు ఆంక్షలు విధించారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని, సై అంటే సై అంటూ పోటీ చేస్తామని సవాల్‌ విసిరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని తగలపెట్టారని, మరో మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిలో పెట్రోల్‌ బాంబులు వేశారని, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారే తప్ప నిలువరించలేదని ఆరోపించారు. దళితుడు సాల్మన్‌ను ఆటవికంగా హత్య చేశారని, దీనిపై ఢిల్లీ వెళ్లి నేషనల్‌ ఎస్సీ కమిషన్‌కు, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులెక్కడ..?

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని పోలవరం, అమరావతికి నిధులు తగ్గాయని ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, కానీ, ప్రజలను సూపర్‌ సిక్స్‌ పథకాలతో మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో పేదరికం జీరో అవడం కాదని, రాబోయే రోజుల్లో టీడీపీ జీరో అవుతుందని జోస్యం చెప్పారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న చంద్రబాబు లడ్డూ కూడా తిన్నాడని, అప్పుడు ఏమీ మాట్లాడలేదని, కానీ, టీడీపీ అధికారంలోకి రాగానే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి డిజిటలైజేషన్‌ కూడా చేస్తున్నామని, డిజిటలైజేషన్‌లో జిల్లాలోనే కొండపి మొదటి స్థానంలో నిలిచిందని కొనియాడారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, సీఈసీ సభ్యుడు డాక్టర్‌ మాదాసి వెంకయ్య, మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, నాయకులు మసనం వెంకట్రావు, పిన్నిక శ్రీనివాసరావు, దుద్దుగుంట మల్లికార్జునరావు, ఇంకొల్లు సుబ్బారెడ్డి, చింతపల్లి హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, జిల్లా ఉపాధ్యక్షుడు డాకా పిచ్చిరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం 1
1/1

కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement