తినేందుకు వెళ్తుంటే.. మృత్యువు దిగమింగింది!
● టిఫిన్ కోసం వెళ్తుండగా బైక్ ప్రమాదం
● అక్కడికక్కడే టెన్త్ విద్యార్థి మృతి
● మరోబాలుని పరిస్థితి విషమం
యర్రగొండపాలెం: ఆకలి తీర్చుకోవడానికి మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. సోమవారం రాత్రి యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల రోడ్డులో చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. కొలుకులకు చెందిన వేల్పుల గాలెయ్య(16) పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. రాత్రి చదువుకుంటున్న సమయంలో తనకు ఆకలి వేయడంతో తోడుగా 8వ తరగతి విద్యార్థి సండ్రపాటి నానిని పిలుచుకొని మోటారుబైక్‌పై యర్రగొండపాలెం బయలుదేరాడు. తమ గ్రామం దాటిన తర్వాత ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాలెయ్య అక్కడికి అక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బైక్‌ను వరి కోత యంత్రం ఢీకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు.
● డివైడర్‌ను బైక్ ఢీకొని ఒకరికి
తీవ్ర గాయాలు!
యర్రగొండపాలెం: పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టడంతో తల పగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి వైపాలెం మండలంలోని గురిజేపల్లిలో చోటుచేసుకుంది. ఆవులమంద నాగరాజు అనే వ్యక్తి బోయలపల్లెలో ఒక శుభకార్యానికి వెళ్లాడు. అక్కడి నుంచి మద్యం మత్తులో బైక్‌పై స్వగ్రామానికి చేరాడు. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడనగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో తలకు తీవ్రంగా గాయమైంది. రక్తపు మడుగులో పడి ఉన్న నాగరాజును సంఘటన జరిగిన దాదాపు అరగంట తర్వాత గ్రామస్తులు గుర్తించి యర్రగొండపాలెంలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. నాగరాజు నడుపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిందా, లేదంటే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు.
మార్కాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే ప్రతి అర్జీపై చట్టప్రకారం విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. సోమవారం మార్కాపురంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌లో ప్రజలు వివిధ సమస్యలపై 43 అర్జీలు అందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో చర్చించినట్లు తెలిపారు. త్వరితగతిన విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించామన్నారు. ప్రధానంగా భూ సమస్యలు, ఆర్థిక మోసాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ కేసులపై ఫిర్యాదులు అందాయని డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో మార్కాపురం, పొదిలి, పామూరు, గిద్దలూరు సీఐలు సుబ్బారావు, రాజేష్‌కుమార్, శ్రీనివాసరావు, సురేష్, పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.
కొనకనమిట్ల: పొగాకు క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్యారన్ దగ్ధమైంది. ఈ సంఘటన కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అట్లా నరసింహారెడ్డికి చెందిన బ్యారన్‌లో సుమారు 1100 పొగాకు అల్లుడుకర్రలు క్యూరింగ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మొద్దు గొట్టంపై అల్లుడుకర్ర పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ చింతంరెడ్డి చెన్నారెడ్డి ఇచ్చిన సమాచారంతో మార్కాపురం అగ్నిమాపక దళం వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. ప్రభుత్వం, పొగాకు బోర్డు అధికారులు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
తినేందుకు వెళ్తుంటే.. మృత్యువు దిగమింగింది!
తినేందుకు వెళ్తుంటే.. మృత్యువు దిగమింగింది!


