రెవెన్యూలో సమ్యసల సైరన్
ఉలవపాడు: కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుంచి విడిపోయి ప్రకాశం జిల్లాలోకి వచ్చి దాదాపు నెల గడిచిపోయింది. ఈ నెల నుంచి కందుకూరు నియోజకవర్గం పరిధిలో రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ఎప్పటి నుంచి సేవలు అందిస్తారో కూడా రెవెన్యూ శాఖలో ఎవరికీ అర్థంకాని పరిస్థితులు ఉన్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరు, ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు మండలాలు ప్రకాశం జిల్లాలోకి వచ్చాయి. చేరిన తర్వాత ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజులు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఇక నుంచి కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లా అని నిర్ధారించారు. జిల్లా మార్చారుగానీ సేవలు అందించడంలో మాత్రం నిర్లక్ష్యం జరుగుతోంది. రెవెన్యూకు సంబంధించి నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాలను వెబ్ ల్యాండ్‌లో తొలగించారు. అయితే ప్రకాశం జిల్లాలో వెబ్ ల్యాండ్‌లోకి ఆ 5 మండలాలను కలపడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నెల 15 వరకు ప్రకాశం జిల్లాలో వెబ్‌ల్యాండ్‌లో 5 మండలాలు లేవు. దీంతో రెవెన్యూకు సంబంధించి ఎలాంటి సేవలు అందించే వీల్లేకుండా పోయింది. ఈ నెల 20వ తేదీన వెబ్‌ల్యాండ్‌లో మండలాలను నమోదు చేశారు. కానీ సేవలు అందించే విషయంలో మాత్రం ఏ మాత్రం పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
డిజిటల్ సంతకం లేక నిలిచిన సేవలు
కందుకూరు నియోజకవర్గంలో జనవరి ఒకటో తేదీ నుంచి రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లాలోకి వచ్చిన తర్వాత వెబ్ ల్యాండ్ మారినా తహసీల్దార్‌లకు డిజిటల్ సంతకం ఇవ్వని కారణంగా సేవలు నిలిచిపోయాయి. కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఇతర ధ్రువీకరణ పత్రాలు, రైతులకు అందించాల్సిన సేవలు, పాస్ పుస్తకాల పంపిణీ, మ్యుటేషన్‌లు.. ఇలా అన్ని సేవలు నిలిచిపోయాయి. ఏ సేవ అందించాలన్నా ఆన్‌లైన్‌లో తహసీల్దార్ డిజిటల్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. నెల రోజులగా ఈ డిజిటల్ సంతకం ఇవ్వడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా జనవరి మొత్తం రెవెన్యూ సేవలు నిలిచిపోయాయి.
సేవల కోసం ఎదురుచూపులు
రెవెన్యూ శాఖ ద్వారా అందించే సేవల కోసం కందుకూరు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ శాఖతో పాటు ఎన్నో రకాల సేవలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఇవ్వాల్సిన సర్టిఫికెట్ల జారీలో ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మండలం ఉందిగానీ అందులో గ్రామాల జాబితా రావడం లేదు. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇప్పటికీ ఏఈపీడీఎస్ వెబ్‌సైట్‌లో కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఉంది. రేషన్ షాపులకు సంబంధించిన వివరాలన్నీ ఇంకా నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. జిల్లా మార్పు తర్వాత వేగంగా జరగాల్సిన మార్పులు నత్తనడకన జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు అన్ని శాఖల సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసరావును వివరణ కోరగా రెండు రోజుల్లో డిజిటల్ సంతకాలు వస్తాయని చెప్పారు.
నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశంలో కలిసిన
కందుకూరు నియోజకవర్గం
నెల రోజులుగా పరిష్కారం కాని
రెవెన్యూ సమస్యలు
తహసీల్దార్‌లకు నూతన డిజిటల్
సంతకాల జారీలో జాప్యం
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజల ఇబ్బందులు


